Followers

జిల్లాకు వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకున్న వారికి భోజన వసతి సౌకర్యాలు


 


ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికీ 14 రోజుల గృహనిర్బంధం తప్పనిసరి


రేషన్ కోసం ప్రజలు గుంపులుగా రాకుండా చర్యలు చేపట్టాలి


కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సేవలు


వ్యాధి లక్షణాలు వున్నవారు దాచిపెట్టొద్దు - వైద్యులను సంప్రదించి వారి సలహాలు పొందాలి


కరోనా సహాయక చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఆదేశాలు


విజయనగరం, పెన్ పవర్ 


జిల్లాకు ఉపాధి, విద్య, ఇతర అవసరాల నిమిత్తం వచ్చి లాక్ డౌన్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జిల్లాలో చిక్కుకొని బయటకు వెళ్లలేని పరిస్తితులు ఏర్పడిన నేపథ్యంలో అటువంటి వారందరికీ ప్రభుత్వం ద్వారానే వారికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వివిధ మండలాలు, పట్టణాల్లో వున్న ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి ఆయా ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో వారికి సోమవారం నుండే భోజన వసతి సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.ఏం.హరిజవహర్ లాల్ ఈ మేరకు ఆయా మండలాలు, పట్టణాల్లో వున్న బి.సి., సాంఘిక, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్ లను ఆదేశించారు. భోజన, వసతి సౌకర్యాలు అవసరమన వారిని గుర్తించే ప్రక్రియ ఆదివారం సాయంత్రం నాటికి పూర్తి చేసి సోమవారం నుండే వారికి అన్నీ సౌకర్యాలతో నాణ్యమైన భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు, కార్మికులు, విద్యార్దులు వంటి వారందరికీ వచ్చే 15 రోజులపాటు స్థానికంగానే వుండేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, అటువంటి వారు జిల్లాలో ఏ ప్రాంతంలో వున్నా ఆయా మండలాల తహశీల్దార్ లు, లేదా మున్సిపల్ కమిషనర్ లను తక్షణం సంప్రదించాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లో ఇప్పటికే అందుబాటులో వున్న సరుకులను వినియోగ్గించుకోవాలని అవసరమైతే ప్రకృతి విపత్తుల నిధుల నుండి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. కూలీలు వసతి కలిగి వుంది భోజన సౌకర్యాల కోసం బియ్యం పప్పు వంటి సరకులు కావాలని కోరినా సమకూర్చాలని సూచించారు. దీనితో పాటు పట్టణాల్లో వుండే అనాధలు, నిరాశ్రయులకు కూడా భోజన వసతి సౌకర్యాలు సమకూర్చాలని కలెక్టర్ తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను  ఆదేశించారు.


        జిల్లాకు లాక్ డౌన్ విధించిన తర్వాత ఇతర రాష్ట్రాల నుండి వచ్చి గ్రామాలు, పట్టణాల్లో వుంటున్న వారికి కూడా 14 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి చేయాలని వారి వల్ల కూడా ఆయా ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశం వున్నందున జాగ్రత్తలు అవసరమని చెప్పారు. వారం రోజుల క్రితం విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారిని వైద్య సిబ్బంది నిత్యం గమనించాలని వారిలో ఏమైనా వ్యాధి లక్షణాలు వుంటే తక్షణమే వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలన్నారు. జిల్లాకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తమలో కరోనా వ్యాధి లక్షణాలైన జలుబు, జ్వరం, పొడి దగ్గు వంటి లక్షణాలు వుంటే వాటిని దాచి పెట్టకుండా వైద్యుల సలహాలు పొందాలని కలెక్టర్ సూచించారు. తద్వారా వారికి, వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతం వారికి కూడా ఈ వ్యాధి సోకకుండా మేలుచేసిన వారవుతారని పేర్కొన్నారు.


        జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ పంపిణీకి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రేషన్ డీలర్లు తమ డిపోల వద్ద రేషన్ కార్డు దారులు సామాజిక దూరం పాటించేలా మంచి ఏర్పాట్లు చేశారని, అయితే రేషన్ కోసం ప్రజలు గుంపులుగా వస్తున్నట్లు తెలుస్తోందని దీనిని నివారించాల్సి వుందన్నారు. రేషన్ డిపోల వద్ద తగినంత నీడ వుండేలా ఏర్పాట్లు చేయాలని అవసరమైతే టార్పాలిన్లు వంటివి వేసి ఎండలో నిల్చోకుండా చూడాలని కోరారు. ఒక్కో వాలంటీర్ పరిధిలోని కార్డు దారులకు ఒక్కో రోజున అందించేలా షెడ్యూల్ రూపొందించి ఆరోజున మాత్రమే వారు రేషన్ కోసం వచ్చేలా ముందుగానే వాలంటీర్ల ద్వారా ఆయా కార్డుదారులకు తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో ఏప్రిల్ 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందనే విషయాన్ని కార్డుదారులకు తెలియజేసి వారంతా వారికి కేటాయించిన తేదీ, సమయాల్లో వచ్చేలా చూడాలన్నారు.


        పట్టణాల్లో చాలా ఇళ్ళలో పని వారు వుంటారని వారి ద్వారా కుటుంబంలోని సభ్యులకు కరోనా వ్యాధి సంక్రమించకూడా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వారు ఒకటి కంటే ఇళ్ళలో పనికి వెళ్ళే అవకాశం వున్నందున వారు వచ్చినపుడు చేతులు సబ్బుతో కడిగించడం, మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వీలైతే ఈ వ్యాధి ప్రభావం తగ్గే వరకు ఇళ్ళలో  పనికి రాకుండా చూడాలని, తామే ఆ పనులు చేసుకోవాలని  తెలిపారు.


ఆదివారం రోజున ప్రజలు చేపలు, మాంసం దుకాణాల వద్దకు గుంపులుగా చేరి సామాజిక దూరం పాటించడం లేదని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ లు, మండలాల్లో తహశీల్దార్ లు దీనిపై జాగ్రత్త వహించి అవసరమైతే గ్రామాలు, పట్టణాల్లో జనసమ్మర్ధం లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్నీ మార్కెట్ ల వద్ద, కూరగాయలు విక్రయించే ప్రాంతాల్లో మైకుల ద్వారా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.


జిల్లా ప్రజానీకానికి కరోనా వ్యాధి సంక్రమించే విధానం, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటామన్నారు. జిల్లాలో వైద్య సిబ్బంది, కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొనే ఇతర శాఖల సిబ్బందికి అవసరమైన గ్లౌసులు, మాస్క్ లను సరఫరా చేసేందుకు డి.ఆర్.డి.ఏ., మెప్మా ప్రాజెక్ట్ డైరక్టర్ లు, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖలోని కొన్ని పరిశ్రమల ద్వారా వీటిని తయారు చేస్తున్నారని అక్కడ నుండి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...