క్రమశిక్షణతో చదివి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలి
విజయనగరం,పెన్ పవర్విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తుది పరీక్షలకు ఉపయోగపడే ఆల్-ఇన్-ఒన్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బంగ్లాలో,బుధవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు డా ఎం. హరిజవహర్‌లాల్ ముఖ్య అతిధిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డా ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ - ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీగారు తమ శాఖ ద్వారా 41 ప్రభుత్వ పాఠశాలలను దత్తత స్వీకరించి, విద్యార్ధులలో శక్తి సామర్థ్యాలను పెంచి, వారిని ఉన్నతమైన స్థానాలకు తీసుకు వచ్చేందుకుగాను, స్టూడెంట్ పోలీసు క్యాడెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు మంచి ఫలితాలు సాధించేందుకు పట్టుదల, క్రమశిక్షణతో, చదువు పట్ల ఆసక్తితో చదవాలన్నారు.ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి ఫలితాలు సాధించే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు శక్తి వంచన లేకుండా విద్యార్ధుల ఉన్నతికి కృషి చేయాలన్నారు. విద్య అన్నది ప్రతీ వ్యక్తికి అత్యంత గౌరవాన్ని తీసుకొస్తుందని, ఆగౌరవం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు, జన్మ స్థలం యొక్క ఉన్నతిని పెంచుతుందన్నారు. బాగా చదువుకోవడం వలన మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, విజయనగరం అంటే విద్యలనగరమని, ఆ పేరుకు సార్ధకత తీసుకువచ్చే విధంగా చదవాలన్నారు.పోలీసుశాఖ వలన క్రమశిక్షణ అలవడుతుందని, క్రమశిక్షణ ద్వారా పట్టుదలను పెంచుకొని, బాగా చదివి ఉన్నతమైన స్థానాలలోకి ఎదిగి, మీ తల్లిదండ్రులను, మంచి పేరు తీసుకువచ్చి, మీ ప్రాంతాలను అభివృద్ది చెయ్యాలని జిల్లా కలెక్టరు ఆకాంక్షించారు. విధ్యార్ధులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత లక్ష్యాలను లక్ష్యంగా చేసుకొని, ఉన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా ఎదగాలన్నారు.
స్టూండెంట్ పోలీసు క్యాడిట్ కార్యక్రమంలో విద్యార్ధులకు ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను జిల్లా ఎస్పీబి. రాజకుమారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా హర్షణీయమని, విధ్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని వృధా చేయకుండా బాగా చదివి 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టరు డా|| ఎం. హరిజవహర్లాల్ అన్నారు.విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - విద్య ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చునని అన్నింటికీ మూల కారణం విద్యే అన్న సత్యాన్ని ప్రతీ విద్యార్థి గ్రహించాలన్నారు. విద్య ద్వారా వినయం, తద్వారా సమర్ధత, సంపద, ధర్మం, సంతోషం వస్తాయన్నారు. విద్యార్ధి దశలో వినయం, సమయపాలన, శ్రద్ధ, ఆసక్తి, సానుకూల దృక్పథం, నీతి, నియమాలు అలవరుచుకోవాలన్నారు. ఎపిసి పాఠశాలలకు ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని విశాఖపట్నం రేంజ్ డి. ఐ. జి. ఎల్.కే.వి. రంగారావు విజయనగరం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో విద్యార్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించారని, అప్పటినుండి ఎస్పీలుగా పనిచేస్తున్న వారంతా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం పోలీసు సంక్షేమ నిధి నుండి రూ. 4 లక్షల వ్యయంతో ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను ఎపిసి పాఠశాల విద్యార్ధులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, విద్యార్ధులు పట్టుదలతో చదివి జూన్ లో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో 10/10 గ్రేడు మార్కులు సాధించాలన్నారు.
విద్యార్థి దశలో 8, 9, 10 మరియు ఇంటర్మీడియట్ చాలా ముఖ్యమైనవని, ఈ దశలో విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన విద్యార్థులలో ఉండాలని, విద్యార్ధి దశ మళ్ళీ రాదని, తల్లిదండ్రులు మనికిచ్చిన అవకాశాన్ని, ఉపాధ్యాయులు మనకి నేర్పిస్తున్న జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకొనిరాబోతున్న 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, మీపై మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టుకొన్న నమ్మకాన్ని నిలపాలన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, మంచి వ్యక్తిత్వం ద్వారా ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొనే వరకు విశ్రమించకూడదన్నారు. విద్యార్ధి దశలో 10వ తరగతి చాలా కీలకమైనదని, సమయం చాలా విలువైనదని, సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగపర్చుకొని, ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను చదివి, మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఎస్.పి.సి. కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడత 10పాఠశాలలను ఎంపిక చెయ్యగా, వాటికి అదనంగా మరో 31 పాఠశాలలను ఎంపిక చేసామన్నారు. ఈ కార్యక్రమాన్నిఅమలు చేసే క్రమంలో ప్రతీ విద్యార్ధితోనుపోలీసు అధికారులు కలిసి మాట్లాడి, వారిలో స్ఫూర్తి కలిగించడం వలన మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు.