అభివృద్ధి నిరోధకులు మావోయిస్టు లు
అగ్ర నాయకుల ప్రాణాలకు దళ సభ్యుల ప్రాణాలు బలి
ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు
చింతపల్లి, పెన్ పవర్
జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నవరం పోలీస్ పరిధి ఏ ఓ బి లోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించగా తారసపడిన మావోయిస్టులు ముందుగా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఒక మావోయిస్టు మృతిచెందాడని చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ కోరుకొండ,పెదబయలు దళ సభ్యులు,మిలీషియా సభ్యులతో మావోయిస్టు అగ్ర నేతలు ఏవోబీ లోని దిగజనబ అటవీ ప్రాంతంలోని పెద్ద వాగు వద్ద సమావేశం అవుతున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఒడిస్సా ప్రత్యేక పోలీస్, జిల్లా ప్రత్యేక పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ప్రారంభించారన్నారు. దిగజనబ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారన్నారు.ఆత్మ రక్షణార్థం పోలీసులు నిర్వహించిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా కొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారన్నారు.చీకటి పడడంతో 26 ఉదయం మృతదేహం లభ్యమయ్యిందన్నారు. మృతిచెందిన మావోయిస్టు జి.మాడుగుల మండలం, వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి దయ అలియాస్ పేతురు గా గుర్తించామన్నారు. ఐదేళ్ల నుంచి దళంలో తిరుగుతున్నాడన్నారు. మృతిచెందిన మావోయిస్టు సోదరుడు(అన్న) కూడా గతంలో రామ్ గూడ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడన్నారు. మరి వారి కుటుంబ సభ్యులకు దిక్కెవరని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఎప్పుడూ అమాయకులైన దళ సభ్యులే మృతి చెందుతున్నారన్నారు. అగ్ర నేతలు అమాయకులైన వీరిని అడ్డం పెట్టుకుని,వారి ప్రాణాలు కాపాడుకుంటూ తప్పించుకుంటున్నారన్నారు. మావోయిస్టులు వారోత్సవాల పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటూ, గిరిజన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.గిరిజనులకు రహదారులు, పాఠశాలలు,సెల్ టవర్లు, భవనాలు అడ్డుకుంటూ అభివృద్ధికి అవరోధకులుగా మిగిలారన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిరంతరం కూంబింగ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు హింసను విడనాడి, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవమని ఆయన హితవు పలికారు. అటువంటి వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు వచ్చేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment