నిర్బంధ తనిఖీలు నిర్వహించిన కూకట్ పల్లి పోలీసులు
కూకట్ పల్లి, పెన్ పవర్కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ లో బుధవారం రాత్రి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ జోన్ లోని పది పోలీస్ స్టేషన్స్ కి సంబంధించిన నూటయాబై ఆరు మంది పోలీసు సిబ్బంది పది బృందాలుగా ఏర్పడి నిర్బంధ తనిఖీలు చేశారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి వ్యక్తి యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా కారణంగా సంవత్సరం తరువాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని, రాజీవ్ గాంధీ నగర్ క్రైమ్ ఏరియా కావడం వల్ల తనిఖీలు నిర్వహించినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాలనీలో నివసించే ఫిరోజ్ అనే రౌడీ షీటర్ ను జనవరిలో లో హత్య చేయడం జరిగిందని, రౌడీ ఆక్టీవీటి ఎక్కువగా ఉండడంతో కాలనీ లోని 292 ఇండ్లను జల్లడపట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని, ట్రాఫిక్ చాలన్ ఉన్న డెభై తొమ్మిది ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఐదు కార్లు, ఒక టెంపో ట్రావెలర్ వాహనాన్ని స్వాధీనం చేసికొని సీజ్ చేశారు. అలాగే ఎవరైనా వ్యక్తులు గతంలో ఏదైనా నేరాలలో నిందితులుగా ఉన్నారా అని సిడాట్ టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఇరవై మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కార్డాన్ సెర్చ్ ద్వారా ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడమే తమ ముఖ్య ఉద్దేశ్యం అని, నేరస్తులను గుర్తించడంలో తెలంగాణ పోలీసులు వాడుతున్న టెక్నాలజీ ద్వారా నేరస్తులలో భయం పెరిగి, నేరాలు తగ్గుముఖం పడతాయని డిసిపి వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్డన్ సెర్చ్ నిర్వహించడానికి ముఖ్య ఉదేశ్యం అవాంచనీయ కార్యకలాపాలు జరగకుండా ముందుగానే అరికట్టేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో కూకట్ పల్లి ఏసిపి సురేందర్ రావు, సిఐ నర్సింగ్ రావు, ఎస్.ఐలు శంకర్, భానుప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



No comments:
Post a Comment