అరకు లోయలో నేటి నుండి స్వచ్ఛంద లాక్ డౌన్
కరోనా కేసులు తీవ్రం అవుతున్నందున మంగళవారం నుంచి పర్యాటక కేంద్రమైన అరకులోయలో 'ఆఫ్ డే' స్వచ్ఛంద లాక్డౌన్ కు తెర తీశారు.ప్రజారోగ్యం దృష్ట్యా సానిక వర్తక, వ్యాపార,పౌర సంక్షేమ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అరకులోయ గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం రాత్రి పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అత్యవసర సమావేశం నిర్వహించి వర్తక సంఘం ప్రతినిధులు, పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు వ్యాపారులు అందరూ కలిసి స్వచ్ఛంద లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక కేంద్రమైన అరకులోయను కరోనా నుంచి కాపాడాలని, ఆరోగ్యకరమైన అరకు లోయగా మార్చ డానికి తమ వంతు కృషి చేయడంలో భాగంగా స్వచ్ఛంద లాక్ డౌన్ అవసరమని వర్తక సంఘం ప్రతినిధులు, పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు, గిరిజన, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 20 నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత పాటించాలన్న సంకల్పంతో గత ఏడాది కూడా పౌర సంక్షేమ సంఘం, వర్తక సంఘం ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 2020 జూన్ నెలనుంచి జూలై నెల వరకు ఆప్ డే స్వచ్ఛంద లాక్ డౌన్ ను సుదీర్ఘ కాలం పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొంతమంది యువకులు, సంఘ పెద్దలు ఒక టీం గా ఏర్పడి ప్రతి దుకాణాల్లో, హోటల్స్ లో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు విధిగా వాడాలని,శానిటైజర్లు వినియోగించాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారం తీసుకోవాలని నోమాస్క్ నోఎంట్రీ నినాదంతో యండపల్లివలస, అరకులోయ, సుంకరమెట్ట ప్రాంతం వరకు అవగాహన కల్పించడం తో తగ్గుముఖం పట్టింది.మళ్లీ ఈ ఏడాది 2021 మార్చి నుంచి 'సెకండ్ వే' కరోనా వ్యాధి మళ్లీ విజృంభిస్తుండడంతో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వచ్ఛంద లాక్ డౌన్ నిర్వహించాలని సంకల్పించి వర్తక, వ్యాపార, పౌర సంక్షేమ సంఘం స్వచ్ఛంద లాక్ డౌన్ కు అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ప్రతి వ్యాపార, వర్తకులు కట్టుబడి ఉంటామని వ్యాపారంలో కొంత నష్ట పోయిన మన ప్రాణాలు కాపాడుకుంటూ, ఇతరుల ప్రాణాలు కూడా కాపాడడం ప్రతి ఒక్కరికి సామాజిక భాద్యత అని సంకల్పం చి, గతంలో మాదిరిగానే భౌతిక దూరం, మాస్కుల వాడకం, శానిటైజర్లు వినియోగం వంటివాటిపై సంపూర్ణ అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ స్వచ్ఛంద లాక్ డౌన్ మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. కరోనా తగ్గుముఖం పట్టె వరకు అన్ని షాపులు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపార లావాదేవీలు కొనసాగించి అనంతరం దుకాణాలు పూర్తిగా మూసి వేయాలని తీర్మానం చేశారు. అలాగే హోటల్స్ మధ్యాహ్నం భోజనం సమయం వరకు యధావిధిగా నిర్వహించి, సాయంత్రం, రాత్రి సమయాల్లో పార్సెల్ సర్వీస్ ఇవ్వాలని నిర్ణయించారు. మాస్కులు దరించి సరుకులు క్రయ విక్రయాలు జరుపుకోవాలని, మాస్కులు దరించకుండా ఎవరొచ్చినా భౌతిక దూరం పాటించక పోయినా సరుకులు ఎవరూ ఇవ్వవద్దని సంఘం తీర్మానం చేసింది. బేకరీ, స్వీట్ షాపులు సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే వ్యాపారం చేసుకుని అనంతరం మూసి వేయాలని వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాపుగంటి క్రిష్ణారావు, ముఖి పెద్ద సాంబయ్య, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ డి. గోవర్ధన్ స్పష్టం చేశారు. స్వచ్ఛంద లాక్ డౌన్ విషయాన్ని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణకు, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టెలి దాసు బాబుకు, అరకు లోయ సిఐ, ఎస్ఐ, తాసిల్దార్ కు తెలిపారు.
No comments:
Post a Comment