ప్రతీఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్హోం ఐసోలేషన్లో ఉన్నవారికి కోవిడ్ కిట్లు పంపిణీ
విజయనగరం, పెన్ పవర్
కోవిడ్ వచ్చినవారితోపాటు, వ్యాధి రాని వారు కూడా వచ్చినట్టుగానే భావించి, తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ .లాల్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని అన్నారు. ప్రతీఒక్కరూ తప్పనసరిగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందజేసిన మెడికల్ కిట్లను స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వద్ద బుధవారం ఎఎన్ఎంలకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విధాలుగా కోవిడ్ చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉండీ కోవిడ్ సోకినవారికి, ఆక్సీజన్ పరిమాణం తక్కువగా ఉన్నవారికి, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స చేయడం జరుగుతోందన్నారు. దీనికోసం 14 ప్రభుత్వ, 16 ప్రయివేటు ఆసుప్రతులను సిద్దం చేశామని, ప్రస్తుతం 997 మంది వరకూ కోవిడ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నవారినీ, లక్షణాలు లేనప్పటికీ, హోం ఐసోలేషన్‌లో ఉండటానికి అవకాశం లేనివారినీ ఉంచేందుకు జిల్లాలో ఏడు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో మొత్తం 3,600 పడకలు ఉన్నాయని, 24 గంటలూ వైద్యుల పర్యవేక్షణలోపాటు, అవసరమైతే వినియోగించేందుకు ఆక్సీజన్, మందులు, అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బలవర్థకమైన ఆహారాన్ని అందించడంతోపాటు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతం 100 మంది వరకూ కేర్ సెంటర్లలో ఉన్నారని కలెక్టర్ చెప్పారు.
హోం ఐసోలేషన్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇళ్లలోనే ఉంచి చికిత్సను అందించడం జరుగుతోందని చెప్పారు. ఇలా ప్రస్తుతం సుమారు 5వేల మంది వరకూ హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరందరికీ కోవిడ్ కిట్లను అందజేయడం జరుగుతోందన్నారు. ఎఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వీరికి కోవిడ్ కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. దీనికోసం జిల్లాకు సుమారు 75 వేల కోవిడ్ కిట్లు వచ్చాయని, వీటిలో 45 వేల కిట్లను ఇప్పటికే పిహెచ్‌సిలకు పంపించడం జరిగిందని అన్నారు. ఇవి కాకుండా సబ్ సెంటర్ల పరిధిలోని ఎఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా నేరుగా పంపిణీ చేసేందుకు, వారికి సుమారు 22వేల కిట్లను అందజేయడం జరిగిందని చెప్పారు. ఎంత త్వరగా కిట్లను పంపిణీ చేస్తే, రోగులు అంత త్వరగా వ్యాధి నుంచి కోలుకుంటారని అన్నారు. అందువల్ల, ఈ కిట్లు పంపిణీని కంట్రోల్ రూముద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. జింకు, విటమిన్లు, సిట్రిజన్, యాంటీ బయాటిక్ టేబ్‌లెట్లు, వాటిని వాడే విధానాన్ని కూడా కిట్లలో పొందుపర్చడం జరిగిందన్నారు. వ్యాధి సోకినప్పటికీ, అధైర్య పడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ చామంతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment