భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలి
రాజమహేంద్రవరం,పెన్ పవర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలని టీఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు కోరారు.గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారిపోతుందని, గత రెండేళ్ళుగా కార్మికులకు వరుస కష్టాలు వచ్చాయన్నారు. ముఖ్యంగా ఇసుక కొరత ఒక పక్క వేధిస్తుంటే మరో పక్కకరోనా లాక్ డౌన్ తో లక్షలాదిమంది కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ప్రస్తుతం ఏదో విధంగా పని కల్పించుకుని పని చేసుకుంటుంటే కరోనా సెకండ్ వేవ్ అంటూ మళ్ళీ పాక్షిక కర్ఫ్యూ విధించారన్నారు. దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది భవన నిర్మాణ కార్మికులేనని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులు చేసే సమయంలో వాళ్ళు బయట తిరిగి కరోనా వ్యాప్తి జరిగే అవకాశం లేదన్నారు. కేవలం కార్మికులు ఆయా భవనాల్లో మాత్రమే పనులు చేస్తారని, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ,శానిటైజర్ వినియోగిస్తూ పనులు చేసుకుంటారని, కనుక ప్రభుత్వం ఈ పాక్షిక కర్ఫ్యూ నుంచి భవన నిర్మాణ కార్మికులకు తప్పక మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే గత ఏడాది కరోనా లాక్ డౌన్ కాలంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్ధిక సాయం అందిస్తామన్న హామీని తక్షణం నెరవేర్చాలన్నారు. భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని,తక్షణం ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వడంతో పాటు రైతులకు, నేతన్నలకు,రజకులకు,దర్జీలకు ఇస్తున్న విధంగా భవన నిర్మాణ కార్మికులు అందరికీ ఏటా రూ.10వేలు ఆర్ధిక సాయం అందించాలని,ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డులో గత ప్రభుత్వాలు పెట్టిన స్కీములను తొలగించాలనే ఆలోచనను తక్షణం విరమించుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమ స్కీములన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు.
No comments:
Post a Comment