గండిగుండం లో ఓటర్లను సజీవ సమాధి చేస్తామంటూ బెదిరించారని ఎంపీ విజయసాయిరెడ్డి పై ఆరోపణ
పెన్ పవర్, విశాఖపట్నం సీటీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ డిమాండ్ పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం తగిన విధంగా స్పందించకపోతే జై ఆంధ్ర ఉద్యమం మళ్ళీ పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ శనివారం.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కార్యాలయాలకు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ స్వయంగా వినతిపత్రాలను అందజేశారు. ఆ వినతి పత్రాలలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.విశాఖ జిల్లా గండిగుండం గ్రామంలో ఓటర్లను సజీవ సమాధి చేస్తామని.. అధికార వైసీపీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, గండిగుండం లో స్థానిక నాయకుడు గండ్రేడ్డి శ్రీనివాస్ ఓటర్లను బెదిరించిన వారిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ని సైతం చంపుతామని వైసిపి నాయకులు నేరుగా బెదిరిస్తున్నారని, మరోవైపు తనకు కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కోస్తా ప్రజలు ఎవరూ పరిపాలన రాజధానిని కోరుకోక పోయినా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఆవిర్భవించిందన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి నే కొనసాగించాలంటూ 438 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నార న్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 120 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను పరిశీలిస్తే ఆంధ్ర ప్రదేశ్ అసలు భారత దేశంలో ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తక్షణమే.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం నుంచి ఆంధ్ర ప్రదేశ్ ను, అమరావతిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.డాక్టర్ జి.వి.ఆర్.శాస్త్రి తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ కోరారు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ప్రైవేటీకరణ కాకుండా చూసారో ఇప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని త్వరలోనే విశాఖపట్నం వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిగా రామ్ కోరారు.
No comments:
Post a Comment