హెచ్ఎంటి రిటైర్డ్ ఉద్యోగుల దర్నా..
కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని అమ్మేస్తున్న
కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి..
హెచ్ఎంటి మిషన్ టూల్స్ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి..
ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
జిడిమెట్ల, పెన్ పవర్
హెచ్ఎంటి మిషన్ టూల్స్ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ విశ్రాంత ఉద్యోగులకు చట్టబద్దమైన బకాయలు, గ్రాట్యువిటి, దానిపై వడ్డి, పీఎఫ్, ఈయల్ ఎంక్యాష్మెంట్, సెటిల్మెంట్ అలవెన్స్ ఇతరత్రా రావలసిన బకాయిలపై జీడిమెట్ల హెచ్ఎంటి వద్ద రిటైర్డ్ ఎంప్లాయిస్ దర్నా చేపట్టారు.. ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యేండ్ల తరబడి చెమటోడ్చి కష్టపడిన విశ్రాంత ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన బకాయిలు ఇవ్వకపోవడంతో వారు ఈ వయసులో రోడ్డుపై ధర్నా చేయడం బాధాకరం అన్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఎన్నో కలలు కని ఉంటారని, అలాంటి వారికి న్యాయంగా అందాల్సిన బకాయిలు ఇవ్వడంలో యాజమాన్యం అలసత్వం చూపడం సరైనది కాదన్నారు. దీనికి కారణం హెచ్ఎంటి యాజమాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటూ అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రప్రభుత్వం చట్టపరంగా ఇవ్వాల్సిన బకాయిల్లో మొండి చేయి చూపడం ఎమ్మెల్యే దారుణంగా పేర్కొన్నారు.. ప్రభుత్వ ఆస్తులు అమ్మిన తర్వాత నిజానికి దేశంలో ఎవరు బాగు పడుతున్నరాంటే అంబానీ, అదానిలు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్తులు తగ్గుతుంటే వారి ఆస్తులు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఉంటున్నారంటే కేంద్రం వారి పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిదర్శనం అన్నారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు భారతదేశాన్ని గంపగుత్తగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలని అన్నారు. ఈ సమస్యపై హెచ్ఎంటి యాజమాన్యంతో చర్చిస్తామని వారు సరైన స్పందన ఇవ్వకపోతే త్వరలోనే రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎంపిలందరినీ సమీకరించుకుని కేంద్రంలో సంబంధిత మంత్రి, సెక్రటరీలతో మాట్లాడి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కే.వి.రామారావు, మాజీ ఉపాధ్యక్షుడు కోతి కర్ణపాల్ రెడ్డి, పండరి, మురళి, నిరంజన్, నరహరి, సూర్య ప్రకాష్, భవాని శంకర్, పోచయ్య, జయందర్ నాథ్, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment