భాగ్యనగరానికి బాటలు వేసింది చంద్రబాబు: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ
కూకట్ పల్లి,పెన్ పవర్
కూకట్‌పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని గ్రావిటీ హోటల్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్.ఎల్.సి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్.ఎల్.సీ అభ్యర్థి ఎల్.రమణ, పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు తెరాస పాలనలో అప్పుల పాలయ్యిందని అన్నారు. ఉద్యోగుల పిఆర్సీ పే రివిజన్ కమిషన్ కాకుండా పే రెడ్యుసింగ్ కమిషన్ లాగా కనిపిస్తుందని, కరోనా సందర్భంలో తెరాస ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పై స్పందించలేదని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలా నిర్ణయాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నదని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు 2020 విజన్ వల్లే నేడు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో గుర్తింపు లభించినదని, హైదరాబాద్ నగరం ఒకనాడు కేవలం చారిత్రక నగరం మాత్రమేనని, సైబరాబాద్ నిర్మించి ఐటి కంపనీలు ఏర్పరిచి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం, అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమవుతుందని, రానున్న కాలంలో తెదేపా పార్టీ అన్ని వర్గాల గొంతు అవుతుందని అన్నారు. గతంలో ఎమ్ఎల్సీగా ఉన్న రాంచందర్, నాగేశ్వర్ లు గెలిచిన తరువాత తిరిగి ఓటర్లను కలిసింది లేదని, తాను ఎమ్.ఎల్.సి గా కౌన్సిల్ లో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ నందమూరి. సుహాసిని, ఉప్పలపాటి పద్మ చౌదరి, షేక్ సత్తార్, ఇతర తెదేపా శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


No comments:
Post a Comment