Followers

గుంటూరు మేయర్ పీఠంపై జనసేన కన్ను...

 

గుంటూరు మేయర్ పీఠంపై జనసేన కన్ను...

 

బ్యూరో రిపోర్ట్  గుంటూరు , పెన్ పవర్

 

ఏపీలో మార్చి 10 వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  14 వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.  ఇక ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి.  దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ పిటిషన్లను కొట్టివేసింది. ఎస్ఈసి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.  ఇక ఇదిలా ఉంటె, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవడానికి జనసేన పార్టీ పావులు కదుపుతున్నది.   ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకోలేకపోయినా, జనసేన పార్టీ మెరుగైన ఓటు షేరింగ్ ను సాధించింది.  ఎలాగో బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో మరింత మెరుగ్గా ప్రచారం చేసి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను పార్టీ అన్వేషిస్తోంది.  గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని, మేయర్ పదవి జనసేన పార్టీకి సొంతం చేసుకుంటుందని జనసేన నేత బోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.  వైసీపీ ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని, వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా విజయం తమదే అని అన్నారు.  అభివృద్ధి కావాలో, వైసీపీ ఇస్తున్న తాయిలాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. 

మరోసారి జిల్లాల్లో ఎస్ఈసి పర్యటన

 


మరోసారి జిల్లాల్లో ఎస్ఈసి పర్యటన

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్

మార్చి 10 వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్లు కూడా కొట్టివేయడంతో ఎన్నికలకు మార్గం క్లియర్ అయ్యింది.  ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతున్నది.  ఇందులో భాగంగా ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించబోతున్నారు.  మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయబోతున్నారు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్.  నేడు  నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తుండగా, ఫిబ్రవరి 28 వ తేదీన పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు.  అదే విధంగా మార్చి 1 వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు.  గ్రామపంచాయతి ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. 

తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో

 తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో

 స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరపైకి పోస్కో పేరు

రాజకీయంగా విమర్శలు

శుక్రవారం  శ్రీవారిని దర్శించుకున్న పోస్కో సీఈఓ

విరాళం డీడీలు టీటీడీ అదనపు ఈవోకు అందజేత

 

 బ్యూరో రిపోర్ట్ తిరుమల, పెన్ పవర్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో పోస్కో కంపెనీ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పోస్కో ఆసక్తి చూపుతోంది. ఈ అంశంలో అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి మధ్య విమర్శల పర్వం కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోస్కో సంస్థ తిరుమల వెంకన్నకు భారీ విరాళం ప్రకటించింది.తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో సంస్థ సీఈఓ సంజయ్ పాసి రూ.9 కోట్ల విరాళం అందించారు.  శుక్రవారం ఉదయం సతీసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకున్న సంజయ్ పాసి, ఆపై విరాళం తాలూకు డీడీలను టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందించారు.

పాత నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు...ఏపీ హైకోర్టు స్పష్టీకరణ



పాత నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు...ఏపీ హైకోర్టు స్పష్టీకరణ

 కొత్త నోటిఫికేషన్ కోరుతూ పిటిషన్లు

గతంలో తమను నామినేషన్లు వేయనివ్వలేదని ఆరోపణ

పాత నోటిఫికేషన్ వచ్చి 11 నెలలైందని వివరణ

పిటిషనర్ల వాదనలు తోసిపుచ్చిన హైకోర్టు

ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలని ఆదేశం

 బ్యూరో రిపోర్ట్ అమరావతి , పెన్ పవర్

 ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పాత నోటిఫికేషన్ ప్రకారమే పురపాలక ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా మార్చి 10వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని తెలిపింది.గతంలో అధికార పక్ష నేతలు తమను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారంటూ జనసేన పార్టీతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. పాత నోటిఫికేషన్ వచ్చి 11 నెలలు అయిందని, తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు. అయితే పిటిషనర్ల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పురపాలక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది.

మార్చి 14న విడుదల.. అసలు రంగు తేలేది ఆరోజే

మార్చి 14న విడుదల.. 

అసలు రంగు  తేలేది  ఆరోజే

ఆ రెండు పార్టీలు  సవాళ్లు  ప్రతి  సవాళ్లు

పంచాయతీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ప్రజలను కన్ఫ్యూజ్ చేశాయి 

ఇప్పుడు పక్కగా  పార్టీ గుర్తు పై జరిగే  పోరులో  విజయం  ముంగిట్లో ఎవరు నిలుస్తారో..?

పట్టణ ప్రాంతాలపై ఎంత పట్టు ఉందో  అధికార, ప్రతిపక్ష పార్టీలకు    ఎన్నికల తో తేలిపోనుందా..?

రాష్ట్ర ప్రభుత్వం విధించిన అదనపు ట్యాక్స్ లే  మున్సిపల్ ఎన్నికల్లో తమకు  కలిసి వచ్చే అవకాశం గా నమ్ముతున్న  టీడీపీ.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలు తేడా లేకుండా తమను అదరిస్తారని బలంగా నమ్ముతున్న వైసీపీ

 

స్టేట్ పోలిటికల్ బ్యూరో అమరావతి , పెన్ పవర్

పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేశారు. పంచాయతీల్లో ఎక్కువ స్థానాలను తామే గెలుచుకున్నామంటూ రెండు పార్టీలూ ప్రకటించుకున్నాయి. తమకు 80 శాతం పంచాయతీలు వచ్చాయని అధికార వైసీపీ అంటుంటే, తమ పార్టీ 40 శాతం పంచాయతీలను కైవసం చేసుకుందని టీడీపీ వాదిస్తుంది. ఇక వైసీపీ అయితే ఒకడుగు ముందుకు వేసి ఏకంగా ఒక వెబ్ సైట్ ను తయారు చేసి అందులో పంచాయతీలో గెలిచిన తమ మద్దతుదారుల ఫొటోలను ఉంచారు. ఇలా సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు.  కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు పూర్తిగా పార్టీ గుర్తు మీద జరిగేవే. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వైసీపీ, టీడీపీ అగ్రనేతలు సయితం రానున్నారు. అంటే హోరాహోరీ పోరు జరగనుంది. ఇరవై నెలల జగన్ పాలనపై పట్టణ ప్రజల అభిప్రాయం ఈ ఎన్నికల ద్వారా స్పష్టం కానుంది. ఇప్పటి వరకూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని టీడీపీ, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని వైసీపీ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో ఎవరి సీన్ ఏంటనేది తేలిపోతుంది. ప్రభుత్వ పథకాలు పట్టణాలపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయన్నది స్పష్టమవుతుంది. ఇరవై నెలలుగా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన జగన్ అభివృద్ధి వైపు కన్నెత్తి చూడలేదు. ఇది పట్టణ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు.   ఇక ఇసుక కొరత, మద్యం ధరల పెంపు, పెట్రోలు ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన అదనపు ట్యాక్స్ వంటివి మున్సిపల్ ఎన్నికల్లో పనిచేస్తాయని టీడీపీ బలంగా నమ్ముతుంది. మున్సిపల్ ఎన్నికల్లో తామే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు తేడా లేకుండా తమను ఆదరిస్తాయని, జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ప్రజలు బేరీజు వేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మార్చి 14వ తేదీన ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. ఇప్పటివరకూ వేసిన ముసుగులన్నీ తొలగిపోతాయి.

అలిపిరి టోల్ గేట్ చార్జీలు పెంచిన టీ టీ డి

 అలిపిరి టోల్ గేట్ చార్జీలు పెంచిన టీ టీ డి

 


అలిపిరి టోల్ గేట్ చార్జీలపై టీటీడీ తీర్మానం

గతేడాది జరిగిన టీ టీ డి సమావేశంలో నిర్ణయం

టీటీడీ నిర్ణయంపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ 

కారు టోల్ గేట్ చార్జీ రూ.15 నుంచి రూ.50కి పెంచిన టీటీడీ

తిరుపతి, పెన్ పవర్ 

తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ చార్జీలు భారీగా పెంచారు. 2020 మార్చిలో జరిగిన టీటీడీ సమావేశంలో టోల్ గేట్ చార్జీలు పెంచుతూ తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో, టీటీడీ పాలకమండలి తీర్మానం మేరకు అలిపిరి టోల్ గేట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కారు టోల్ గేట్ చార్జీ రూ.15 నుంచి రూ.50కి పెంచారు. మినీ బస్సు, మినీ లారీకి రూ.50 నుంచి రూ.100కి పెంచారు. లారీలు, బస్సుల టోల్ గేట్ చార్జీలను రూ.100 నుంచి రూ.200కి పెంచారు.

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్..

 పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్..

జగన్ పాలనపై లోకేష్ ధ్వజం

స్టేట్ బ్యూరో  అమరావతి, పెన్ పవర్ 

జగన్ పాలనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేశారు. తమను అధికారంలోకి తెస్తే అన్నా క్యాంటిన్లను తిరిగి తెస్తామని చెప్పారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్వచ్ఛమైన సాగునీరు అందిస్తామని నారా లోకేష్ చెప్పారు. పట్టణ పేదలందరకి శాశ్వత గృహాలను నిర్మిస్తామని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు 21 వేల రూపాయాలకు వేతనాలను పెంచుతామన్నారు. పాత ఆస్తిపన్ను బకాయిని రద్దు చేస్తామని, భవిష్యత్ లో సగం ఆస్తిపన్నును మాత్రమే వసూలు చేస్తామని నారా లోకేష్ చెప్పారు. జగన్ పాలన పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ లా ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మొత్తం పది అంశాలతో నారా లోకేష్ టీడీపీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...