Followers

ప్రకాశం జర్నలిస్ట్ వాల్యూ రూ. 180 


 



 



 



ప్రకాశం జర్నలిస్ట్ వాల్యూ రూ. 180 



జర్నలిస్ట్ అంటే ఇంత చులకనా 



ఆలోచన, ప్రచారం ఘనం 



జర్నలిస్ట్ కు పంపిణీ చేసిన బియ్యం ముక్కవాసన 



రెడ్ క్రాస్ ద్వారా కలెక్టర్ అందజేత 10 కిలోల బియ్యం అన్నారు ! 



వచ్చింది 7 నుంచి 8.50 కిలోల లోపే



 దాతలు అందించిన బియ్యమే మేలంటున్న జర్నలిస్టులు 



మంత్రులు బాలినేని, సురేష్ సహా ఇతర నాయకులు జర్నలిస్టులకు సరైన గౌరవం ఇచ్చారు 



జర్నలిస్టులను చులకన చేసిన రెడ్ క్రాస్ సంస్థ 



పని చేయని వారికి అక్రిడేషన్లు ఇచ్చి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేసిన సమాచార శాఖ 



(  పెన్ పవర్ బ్యూరో, ప్రకాశం)


 విపత్కర పరిస్థితుల్లో పోలీసుల, రెవెన్యూ, వైద్య, పారిశుధ్య సిబ్బందితో పాటు తమ వంతు సామాజిక బాధ్యతగా వృత్తి జర్నలిస్టులు సేవలు అందించారు. కరోనా లాక్ డౌన్ సందర్భం నుండి జర్నలిస్ట్ సంఘాలు వృత్తి జర్నలిస్టులను ఆదుకోవాలని జిల్లా కలెక్టరును కోరారు. అయితే తొలుత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన స్వంత నిధులతో అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా 300 మంది జర్నలిస్టులకు సముచిత గౌరవమిస్తూ ఒక్కో జర్నలిస్టుకు 25 కిలోల నెంబర్ 1 రకం బియ్యం, 2 కిలోల కందిపప్పును అందించారు. అదే విధంగా యర్రగొండపాలెం లో విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను అందించారు. అదే విధంగా గిద్దలూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం ఇతర నియోజకవర్గాల్లో దాతల సహకారంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జర్నలిస్టులను ఎంతో గౌరవంగా 25 కిలోల బ్రాండెడ్ బియ్యాన్ని పంపిణీ చేసి వారికి జర్నలిస్టుల పట్ల వున్న అభిమానాన్ని చాటుకున్నారు. వీటన్నింటిని గమనించిన జిల్లా కలెక్టర్ అక్రిడేషన్ కల్గిన ప్రతి జర్నలిస్టుకు 10 కిలోల రేషన్ బియ్యం, ఒక కేజి కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్ ను అందించేందుకు రెడ్ క్రాస్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. రెడ్ క్రాస్ అంటే తెలియని వారు జిల్లాలో ఉండరని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. విపత్కర పరిస్థితుల్లో సేవా భావమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహించే ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకి జిల్లాలోని వృత్తి జర్నలిస్టులకు వీటిని అందించే బాధ్యతలు అప్పగించారు. ఇంకేముంది జర్నలిస్టులే కదా అని రెడ్ క్రాస్ చిన్నచూపు చూసింది. ఏం చేస్తారులే అనే ధీమా వారిలో స్పష్టంగా కనిపించింది. జిల్లా కలెక్టర్ చెప్పిన తరువాత కూడా ఇంత దారుణంగా రెడ్ క్రాస్ సంస్థ పని చేస్తుందా అని జర్నలిస్టులు చర్చించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎన్నో ఒత్తిడిల మధ్య ఈ బాధ్యతను సేవా భావం కల్గిన రెడ్ క్రాసకు అప్పగించారు. కాని వారు కూడా సేవా భావంను వదిలి జర్నలిస్టులను నిరుపేదలకంటే హీనంగా చూశారని చెప్పేందుకు వారి చేత పంపిణీ చేసిన బియ్యాన్ని చూస్తేనే అర్థమవుతోంది. ప్రకాశం జిల్లా జర్నలిస్టు వాల్యూని రూ.180 కి పరిమితం చేశారు. పైగా ఇచ్చిన బియ్యం కొలతల్లో భారీగా కోతలు పడ్డాయి. 10 కిలోల బస్తా అని చెప్పిన అధికారులు ఎక్కడ కూడా 10 కిలోలు కనిపించలేదు. 7 కిలోల నుంచి 8.50 కిలోల మధ్యనే తూకం రావడం మరో విడ్డూరం. ఏకంగా మర్రిపూడి మండలంలో ఇచ్చిన బియ్యాన్ని అక్కడి జర్నలిస్టులు తూకం వేయడంతో కేవలం 7.300 కిలోలుగా దర్శనమివ్వడంతో అసలు రెడ్ క్రాస్ సంస్థ ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం కాక జర్నలిస్టులు మండిపడుతున్నారు. రెడ్ క్రాస్ సంస్థ అందించిన రేషన్ బియ్యం 10 కిలోలు రూ.10, కిలో కందిపప్పు రూ. 85, ఒక లీటర్ పామాయిల్ రూ.85 మొత్తం గా రూ.180 తో జర్నలిస్టు వాల్యూని నిర్ణయించిన ఘనత ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సంస్థకే దక్కింది. జర్నలిస్టులు, వారి కుటుంబాలపై అధికారులకు ఏ పాటి ప్రేమ ఉందో దీనిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. పైగా పంపిణీ చేసిన బియ్యం కొలతల్లో తేడాతో పాటు ముక్కిపోయిన వాసన కూడా వస్తున్నాయి. ఇలాంటి బియ్యం ఇచ్చి జర్నలిస్టులను చులకన చేయడం ఏమిటని పలు జర్నలిస్టుల సంఘాలు సోషల్ మీడియా వేదికగా ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అయినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం శోచనీయం. జిల్లాలో దాతలు ఇచ్చిన కనీస గౌరవం కూడా ప్రభుత్వ అధికారులు ఇవ్వకపోవడం పై జర్నలిస్టులు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముక్కిపోయిన బియ్యాన్ని మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి. జర్నలిస్టుల విలువ పెంచుతారో లేక ఆ ఏముందిలే ఇచ్చేశాం కదా, ఇంకేం చేస్తారులే అని సర్దుకుంటారో వేచి చూడాలి. జర్నలిస్టులకు పంపిణీ చేసిన బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు, రేషన్ బియ్యం ఎవరు పంపిణీ చేయమన్నారో జిల్లా కలెక్టర్ తేల్చాల్సి ఉంది. మరి జిల్లా కలెక్టర్ దీనిపై విచారణ చేపట్టి జర్నలిస్టులకు న్యాయం చేస్తారో లేదో చూద్దాం. అయితే ఇదంతా ఒకెత్తు అయితే అసలు నిజంగా జర్నలిజంనే వృత్తిగా భావించి పని చేసిన వారి కన్నా అసలు జర్నలిజం అంటే తెలియని వారే అధికంగా ఈ బియ్యాన్ని అందుకోవడం సమాచారశాఖపై పలు విమర్శలకు తావిస్తోంది. మరి ఇన్ని ఇబ్బందులు బయటపడిన సమయంలో జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...