Followers

గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్


గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్


- కరోనా నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలతో మాట్లాడి సభలు, సమావేశాలు నిర్వహించకుండా చొరవతీసుకోవాలి


- పంటకోతలు, వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని సూచన


- వైద్యులపై దాడులు హేయమైన చర్య.. కరోనాపై పోరాటంలో ముందుండి నడిపిస్తున్న వారిపై దాడులు జరగకుండా ప్రజలను చైతన్య పరచాలి


- వలస కూలీలకు భోజన, వసతుల ఏర్పాట్లు చేయడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి


న్యూస్ డెస్క్, పెన్ పవర్


కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలతో మాట్లాడి.. వారి అనుచరులు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకుండా, సామాజిక దూరాన్ని పాటించేలా చొరవతీసుకోవాలని గవర్నర్లు, లెఫ్టినెంట్  గవర్నర్లకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ.. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను అమలు చేసేలా ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలకు సూచించాలన్నారు. గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ఉపరాష్ట్రపతి ఇవాళ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
ఇటీవల జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపడాన్ని ఉటంకిస్తూ.. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ‘మీ రాష్ట్రాల్లో ఎలాంటి ఆధ్యాత్మికపరమైన సభలు, సమావేశాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. నచ్చజెప్పండి. వినకుంటే చట్టపరమైన తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. ప్రజలందరు ఇళ్లలోనే ఉంటూ.. మత ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
పంట కోతలతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ, వీటి నిల్వల కోసం ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వారికి ఉపరాష్ట్రపతి కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవసాయ యంత్రాలను సమకూర్చడంతోపాటు మిగిలిన సౌకర్యాలు కల్పించే విషయంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు చొరవతీసుకోవాలన్నారు. 100 శాతం ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు.
పలుచోట్ల డాక్టర్లపై, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఉపరాష్ట్రపతి ఖండించారు. దురదృష్టకరమైన ఇలాంటి ఘటనలు వైద్యుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులపై దాడులు జరగకుండా ప్రజలను చైతన్య  పరచాలన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలను మరువలేనివని.. వారు మనకోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు అవగతం చేయించాలన్నారు.
విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు అందించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను కూడా ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి, ప్రజలకు అందాల్సిన నిత్యావసర వస్తువులు, మందుల పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. వలస కూలీల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా కృషిచేస్తున్నప్పటికీ.. సమాజం కూడా వారికి భోజనం, వసతి కల్పించడాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు సామాజిక దూరంతోపాటు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటిస్తున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఇకపైనా నిబంధనలను అతిక్రమించకుండా.. ఇదే స్ఫూర్తితో ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునందుకుని ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 35 మంది గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వారి రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వారు వివరించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...