దాహం తీర్చిన సుజల పథకం
రూ.30లక్షలతో త్రాగునీటి కష్టాలకు చెల్లు
సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
విజయనగరం, పెన్ పవర్
ఎండా కాలం వచ్చిందంటే ఒకప్పుడు గ్రామాలు త్రాగునీటికి కటకటలాడేవి. మైళ్లకొద్దీ నడిచి వెళ్లి త్రాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ప్రజల త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యింది. మరోవైపు వేలాది గ్రామాలకు రక్షిత త్రాగునీటి పథకాల ద్వారా ఇంటింటికీ కొళాయిలు వేసి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుజల పథకం మరికొన్ని గ్రామాల దాహార్తి తీరుస్తోంది. ఈ పథకం ద్వారానే ఒక చిన్న గ్రామం తమ త్రాగునీటి సమస్యను పూర్తిగా తొలగించుకొని జలసిరితో కళకళలాడుతోంది. గజపతినగరం మండలం భూదేవిపేట గ్రామ పంచాయతీ పరిధిలో భూదేవిపేట ఒక చిన్న గ్రామం. ఈ గ్రామ జనాభా సుమారు 526 మంది. ఈ ఊర్లోని తొమ్మిది బోర్లు ఇప్పటివరకూ గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాలను తీరుస్తూ వస్తున్నాయి. దీంతో వేసవి వస్తే చాలు, భూగర్భ జల మట్టం పడిపోయి, త్రాగు నీటికి కటకట గా ఉండేది. ఈ పరిస్థితుల్లో ఎన్.ఆర్.డి. డబ్ల్యు. పి సుజల పధకం క్రింద భూదేవిపేటకు ఒక మంచి నీటి పధకం మంజూరయ్యింది. ఈ పధకం తొంబై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి, మిగతా పది శాతం పంచాయతీ నిధులతో నిర్మాణం ప్రారంభమయ్యింది. ప్రజలు భాగస్వామ్యంతో త్రాగునీటి పథకాన్ని నిర్మించుకోవడమే కాకుండా, నిర్వహణా బాధ్యతను సైతం ప్రజలే చూసుకోవడం సుజల పథకం ప్రత్యేకత. పథకం మంజూరు అయినా వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ప్రణాళికలు రూపొందించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, తగిన నీటి వనరులున్నచోటును ఎంపిక చేసి, పధకం పనులను ప్రారంభించి, నిర్ణీత సమయంలోనే పనులను పూర్తి చేసారు. సుమారు 30,000 లీటర్ల సామర్ధ్యం గల నీటి నిల్వ ట్యాంక్ ను నిర్మించారు. ఈ ట్యాంకు నుంచి 24 కొళాయిల ద్వారా గ్రామంలోని అన్ని వీధుల్లో అందరికీ అందుబాటులో ట్యాప్‌లు బిగించారు. వీటి ద్వారా ప్రతిరోజూ గ్రామ అవసరాలకు సరిపడినంత నీటి సరఫరా జరుగుతోంది. సుమారుగా రూ.30లక్షల వ్యయంతో నిర్మించిన ఈ త్రాగునీటి పథకం భూదేవిపేట గ్రామ ప్రజల సుదీర్ఘ కలలను నెరవేర్చింది. వారి త్రాగునీటి కష్టాలను పూర్తిగా తొలగించింది. ఇటీవలే ప్రారంభమైన ఈ పథకాన్ని గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులు సందర్శించినప్పుడు గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ మంచినీటి కష్టాలను తొలగించేందుకు ఈ పథకాన్ని నిర్మించిన ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment