Followers

వైరస్ సోకిన వారి నుంచి ప్రజలకు సోకకుండా చర్యలు


 


కరోనా వైరస్ సోకిన వారి నుంచి ప్రజలకు సోకకుండా చర్యలు జిల్లాలోని 13 కంటోన్మెంట్ జోన్లలోని అనుమానితులకు పరీక్షలు ప్రతి నిత్యం 1000 మందికి పరీక్షలు నిర్వహిస్తాం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్


(పెవర్ బ్యూరో, ప్రకాశం)


కరోనా వైరస్ సోకిన వారి నుంచి ప్రజలకు వ్యాధి సంక్రమించకుండా అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. గురువారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్ నుంచి ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జిల్లాలోని ప్రజలకు ఏ మేరకు వైరస్ సోకింది అనే అంశాలపై దృష్టి సారించామని, సర్వే నిర్వహించిన అనంతరం ఆదిశగా వైద్య పరీక్షలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ముందుగా కంటైన్మెంట్ జోన్ లో కోవిడ్-19 లక్షణాలు కన్పించిన వారందరికి వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఇందుకోసం ప్రాధమికంగా నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 17 ట్రూనాట్ యంత్రాల ద్వారా ప్రతిరోజు 340 మంది నమూనాలు పరీక్షిస్తామని ఆయన చెప్పారు. ప్రాధమిక పరీక్షలో వ్యాధి సోకినట్లు తేలితే వి.ఆర్.డి.ఎల్. యంత్రం ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తామని ఆయన వివరించారు. క్లియ యంత్రం ఒంగోలులో ఏర్పాటు చేసినప్పటికి రీ ఏజెంట్స్, రసాయనాలు జిల్లాకు అందలేదన్నారు. అవి రెండు రోజుల్లో అందుతాయని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందన్నారు. జిల్లాలో వున్న 13 కంటైన్మెంట్ జోస్ పరిధిలోని అనుమానిత లక్షణాలు వున్న వారిని గుర్తించి ప్రతిరోజు 1000 మందికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బఫర్ జోన్ పరిధిలో ప్రతిరోజు 90 మందికి నమూనాలు సేకరించడానికి ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. కోవిడ్ వైద్యశాలల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, క్వారం టైన్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి, కంటైన్మెంట్ జోన్లో విధుల్లో వున్న పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కంటైన్మెంట్ జోన్లో 565 మంది హైరిస్క్ లో వుండగా బఫర్ జోన్లో 1300 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అనంతరం వ్యాధి నిర్ధారణ కోసం వీరికి వి.ఆర్.డి.ఎల్. ద్వారా పరీక్షలు చేస్తామన్నారు. ఇలా మూడు దశల్లో కోవిడ్-19 ప్రభావాన్ని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన వివరించారు. వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన వారికి వైరస్ సంక్రమించకుండా క్వారంటైన్, హెూంఐసోలేషన్లో వుంచుతున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు (రిమ్స్) ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కోవిడ్ వైద్యశాలగా పరిగణిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ వైద్యశాలలుగా మార్చిన కిమ్స్, సంఘమిత్ర, వెంకట రమణ, నల్లూరి నర్సింగ్ హెూమ్ లను సాధారణ వైద్య సేవలకోసం కోవిడ్ ను ఎత్తివేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే కరోనా వైరస్ సోకిన వారికి వైద్యం అందిస్తామని ఆయన చెప్పారు. కోవిడ్-19 ఇతరులకు సంక్రమించకుండా డయాలసిస్ కేంద్రాన్ని సంఘమిత్ర వైద్యశాలకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఇక ప్రసూతి విభాగాన్ని మాతా శిశు వైద్యశాలకు తరలించామని ఆయన వివరించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోవిడ్ కు సంబంధం లేకుండా వేరుగా అత్యవసర సేవలు కొనసాగుతాయని చెప్పారు. కోవిడ్ బాధితులకోసం ప్రత్యేకంగా కేటాయించిన విభాగంలో 300 పడకలలో వైద్య సేవలు అందిస్తామన్నారు.  ఐ.ఎమ్.ఎ. ద్వారా 42 మందిని విధుల్లోకి తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నలుగురు వైద్యులను జిల్లాకు కేటాయించిందన్నారు. డాక్టర్ క్వార్టర్స్ లోను 100 పడకలు కోవిడ్ వ్యాధి గ్రస్తులకోసం వినియోగిస్తామన్నారు. ట్రిపుల్ ఐ.టి. కళాశాలను కోవిడ్ కేర్ సెంటరుగా మార్పుచేస్తున్నామన్నారు. ఇందుకోసం డ్వామా పి.డి. శీనారెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించామని కలెక్టర్ వివరించారు. రాచర్ల మండలంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు (పెన పవర్, రాచర్ల) మండలంలో కరోనా కేసు నమోదయింది. రాచర్లలో 17 సంవత్సరాల యువకుడికి కరోనా సోకింది. 60 ఏళ్ల వృద్ధుడు కి కొద్ది రోజుల క్రితం ప్రమాదంలో చెయ్యి, కాలు ఫ్రాక్చర్ కావడంతో నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు చికిత్స కోసం వెళ్ళాడు. వృద్ధుడి కి సహాయార్థం అతని మనవడు కూడా నరసరావుపేట వెళ్ళాడు. అక్కడ ఇతనికి కరోనా వైరస్ సోకింది. నరసరావుపేట లోని ప్రైవేటు వైద్యశాలలో వైద్య అధికారికి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అతని వద్ద చికిత్స పొందిన వృద్ధుడు, అతని సహాయంగా వెళ్ళిన మనవడు, మరికొంత మందిని మార్కాపురం క్వారంటైన్ కు తరలించారు. అనంతరం యువకుడిని కరోనా పరీక్షల నిమిత్తం అతని శాంపిల్స్ వైద్యులు పరిశీలించగా యువకుడికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. ఇతనితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...