Followers

దేశ ప్రజలకు  ఉపరాష్ట్రపతి సందేశం


కరోనా మహమ్మారి నేపథ్యంలో.. మూడో విడత లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు  ఉపరాష్ట్రపతి సందేశం


ఉమ్మడి భాగస్వామ్యం, సంఘటిత ఆచరణతో కరోనాపై పోరు సాగిద్దాం


భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు


న్యూస్ డెస్క్, పెన్ పవర్ :



కరోనా మహమ్మారి నేపథ్యంలో మే 4 నుంచి మరో 2 వారాల పాటు 3వ విడత లాక్ డౌన్ (3.O) ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించడం కోవిడ్ -19తో సాగుతున్న సమిష్టిపోరాటంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాను. నా దృష్టిలో ఈ నిర్ణయం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత ఏజెన్సీలు, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలతో సహా వ్యాపారుల సహకారంతో వైరస్  వ్యతిరేక పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. ప్రజల జీవితాల పై దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి యుద్ధ వ్యూహాన్ని రూపొందించి చాలా వరకూ విజయం సాధించింది. ఈ ప్రయత్నం అందించిన సానుకూల ఫలితాలను సమాజం హర్షిస్తోంది. 
లాక్ డౌన్ 3.O విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు భరోసాను అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు మరియు జీననోపాధిని ఏక కాలంలో సమతుల్యం చేయవలసిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం మొదలు కానుంది. గ్రీన్ జోన్స్ లో చాలా భాగం, ఆరెంజ్ జోన్స్ లో కొంత భాగం ఆవసరమైన ఆర్థిక పునరుజ్జీవనానికి పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత మార్గంలో అడుగు ముందుకు వేయాలి.
ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమౌతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ఇలాంటి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. మొదటి, రెండవ లాక్ డౌన్ సమయాల్లో తీసుకువచ్చిన గొప్ప మార్పులు, రాబోయే కాలంలో వైరస్ పూర్తిగా అంతమొందే వరకూ అన్ని చోట్ల కొనసాగుతూనే ఉండాలి. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, సమావేశాలు నిర్వహించకపోవడం లాంటి వాటి ద్వారా ఇప్పటి వరకూ ఎంతో లబ్ధి పొందాం. ఇక మీదట కూడా ఇదే మార్గంలో పయనించాలి. ఎందు కంటే కనిపించని ఈ శత్రువు మనం ఆలసత్వం వహిస్తే మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉంది. 
సమర్థవంతమైన నిర్ణయాల ద్వారా కోవిడ్ -19 వ్యతిరేకపోరాటంలో భారతదేశంలో ముందంజలో ఉంది. దీన్ని నేను కోవిడ్ – కామనాలిటి ఆఫ్ విజన్, ఇంటెంట్ అండ్ డిటర్మినేషన్ *(‘COVID’ – Commonality of Vision, Intent and Determination)* గా భావిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో విభిన్న భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో నివసిస్తున్న 130 కోట్ల మంది భారతీయులు అనుసరించిన ఇలాంటి సాధన ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు వంటి ముందు వరుస యోధులతో పాటు రైతులు, ప్రజలు కూడా ప్రశంసలకు అర్హులే. కానీ ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు, సాధించాల్సిన విజయం చాలా ఉంది. కోవిడ్ వైరస్ అన్ని వర్గాలతో కలిసి ఎక్కువ కాలం జీవించగలదని అంచనా వేసిన నేపథ్యంలో, మనం ఈ మహమ్మారి నిజాన్ని అంగీకరిస్తూనే దూరం చేసే ప్రయత్నాలు కొనసాగించాలి.  
లాక్ డౌన్ 3.Oలో మనమంతా ప్రవర్తించే విధానం మీద ఆధారపడే కరోనా తర్వాత సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఉద్దేశించిన తదుపరి చర్యలు ఉంటాయి. రెండు వారాల పరిమితి, భవిష్యత్ కార్యాచరణ కాలపరిమితిని నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక పరీక్ష. ఒక దేశంగా, మనమంతా ఇందులో కచ్చితంగా ఉత్తీర్ణులం కావడం అత్యం కీలకం. ఇందులో మనం ఏ విధంగానూ విఫలం కామని నా గట్టి నమ్మకం. ఇంతకు ముందు నేను చెప్పినట్లు తదుపరి పొడిగింపు, సడలింపు, ముగింపు నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది.
ఈ దిశలో పౌరులందరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...