ఆంధ్రభూమి ఉద్యోగులకు అండగా ఉంటాం:టీయూడబ్ల్యూజే..
హైదరాబాదు,పెన్ పవర్
ఆంధ్రభూమి పత్రిక ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ స్పష్టం చేశారు.
శనివారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో ఆంధ్రభూమి ఉద్యోగులు ఆయనను కలిసి మద్దతును కోరిన సందర్భంలో వారినుద్దేశించి మాట్లాడారు.
కోవిడ్ సాకుతో ఏడాది క్రితం ప్రచురణ నిలిపివేసి, ప్రస్తుతం శాశ్వతంగా మూసివేసేందుకు కుట్రలు చేస్తున్న ఆంధ్రభూమి యాజమాన్యానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పకతప్పదని విరాహత్ హెచ్చరించారు.. ఏడాది నుండి ఉద్యోగులకు జీతాలు చెల్లించక పోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నారని, ఆర్థిక కష్టాలతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు మృతి చెందడం విచారకరమన్నారు. ఆంధ్రభూమి రాజమండ్రి ఎడిషన్ ఉద్యోగి రాం చందర్ రాజు, అతని భార్య ఆర్థిక కష్టాలతో అనారోగ్యానికి గురై చికిత్స పొందలేక ప్రాణం కోల్పోయిన దుర్ఘటనను ఆయన గుర్తుచేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థను నమ్ముకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మంది జీవనం కొనసాగిస్తున్నారని, ఆ పత్రిక యాజమాన్య వైఖరితో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఉద్యోగులకు బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, క్రానికల్, భూమి ఉద్యోగుల మధ్య వ్యత్యాసం చూపవద్దని, క్రానికల్ ఉద్యోగులకు వర్తింపజేస్తున్న అన్నీ సౌకర్యాలు ఆంధ్రభూమి ఉద్యోగులకు కల్పించాలని, ప్రావిడెంట్ ఫండ్ అప్డేట్ చేయాలని, ఆదాయపు పన్నులు చెల్లించాలని, విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యుటీ, వెజ్ బోర్డ్ ఏరియర్స్, బోనస్, ఎల్.టి.సి, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పై డిమాండ్లను వారం రోజుల్లో పరిష్కరించని పక్షంలో ప్రత్యక్ష పోరాటం తప్పదని విరాహత్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రభూమి సీనియర్ ఉద్యోగులు వెలిజల చంద్రశేఖర్, బి.వి.ప్రసాద్, రాజేశ్వర్ ప్రసాద్, జె.ఎస్.ఎన్.మూర్తి, డి.రవికుమార్, తిర్మల్ రావు, సి.హెచ్.నగేష్, విజయ్ ప్రసాద్, విశ్రాంత ఉద్యోగులు మల్లయ్య, శర్మ, ఓదయ్య, పి.మధుకర్, ఏ.అవినాష్, టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఎ. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment