సింగరేణి కార్మికుల సమస్యలపై కరువైన స్పందన
మందమర్రి, పెన్ పవర్
సింగరేణి కార్మికులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని, కార్మికుల సమస్యలపై యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, ప్రజా ప్రతినిధులు కనీసం స్పందించడం లేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) మందమర్రి ఏరియా అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి ఆరోపించారు. గురువారం మందమర్రి ఏరియాలోని కేకే 5 గని పై నిర్వహించిన ద్వార సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మాఫీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఆదాయ పన్ను మాఫీ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొనగా, రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని అలవెన్స్ లపై ఆదాయపన్ను రియంబర్స్మెంట్ పై సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయకుండా దోబూచులాడుతుందని విమర్శించారు. వేజ్ బోర్డు ఒప్పందం ప్రకారం అలవెన్సుల పై ఆదాయపు పన్ను మాఫీ కోల్ ఇండియాలో అమలవుతుండగా, సింగరేణిలో కేవలం అధికారులకు మాత్రమే అమలవుతుందని వివరించారు. సిఎంపిఎఫ్ చిట్టీల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లు తక్కువగా చూపించారని, తక్కువ చూపిన వడ్డీరేటును సరి చేయకపోగా, రెండు సంవత్సరాలు గడుస్తున్నా కార్మికులకు సిఎంపిఎఫ్ లెక్కలు చెప్పడంలో యాజమాన్యం, సింగరేణిలో గుర్తింపు ఉందన్న సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. సిఎంపిఎఫ్ విషయంలో జరుగుతున్న పరిణామాలకు కార్మికుల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. నూతనంగా ఉద్యోగంలో చేరిన బదిలీ వర్కర్ లకు హాజర్లు పూర్తి కాలేదన్న సాకుతో 4శాతం స్పెషల్ అలవెన్స్ ఇవ్వకుండా వారికి ఆర్థికంగా నష్టం చేకూరుస్తుందన్నారు. ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెబుతున్నా కార్మికులపై మాత్రం పని ఒత్తిడి మాత్రం తగ్గడం లేదని ఆరోపించారు. కొంతమంది కార్మిక సంఘం నాయకులు పైరవీల కే పరిమితమవుతూ, కార్మిక సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. శాసనసభలో రిటైర్మెంట్ కార్మికులను గౌరవిస్తామని గొప్పలు చెప్పిన ప్రజా ప్రతినిధులు ఆచరణలో వారికి రావలసిన బకాయిలు, దీపావళి బోనస్ లపై పెదవి విప్పడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని పెంచి సంస్థను ఆర్థికంగా దోపిడీ చేస్తోందని, పైపై మెరుగులు చూపెడుతూ, రావలసిన బకాయిలు ఇవ్వకుండా సంస్థకు నష్టం చేస్తుందన్నారు. అనంతరం పలు సమస్యలపై గని మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్,జిల్లా అధ్యక్షుడు సంకె రవి, జిల్లా కార్యదర్శి గూళ్ల బాలాజీ, నాయకులు సంజీవ్, ప్రవీణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment