టాక్స్ ల పేరిట సింగరేణి సంస్థను దోచుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిఐటియు
మందమర్రి, పెన్ పవర్
తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి సంస్థను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్ల పేరుతో దోచుకుంటున్నాయని సిఐటియు నాయకులు విమర్శించారు. మంగళవారం మందమర్రి ఏరియాలోని ఆర్కేపి సిహెచ్పి ల ద్వార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక్క పక్క సింగరేణికి నూతన గనులను కేటాయించకుండా, మరికొన్ని గనులకు అనుమతులు ఇవ్వకుండా మోసం చేస్తూ, మరోపక్క సిఎస్ఆర్, డిఎంఎఫ్టీ లాంటి అభివృద్ధి నిధుల పేరిట సింగరేణినీ వాడుకుంటూ, వివిధ రకాల టాక్స్ ల పేరిట వేల కోట్ల రూపాయలను తీసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కోలిండియా లో అమలు అవుతున్న మాదిరి అలవెన్సులపైన ఆదాయపు పన్ను మాఫీ గురించి సింగరేణి యాజమాన్యాన్ని అదేశించకుండా, సింగరేణికి రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా, సింగరేణి నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ, ఆర్థికంగా సింగరేణికి నష్టం చేస్తుందని ఆరోపించారు. ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్తులో సంస్థ బిఐఎఫ్ఆర్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కి వచ్చే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గత అసెంబ్లీ సమావేశంలో రిటైర్డ్ కార్మికులను గౌరవించుకుంటామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం నేడు రిటైర్డ్ కార్మికులకు రావలసిన దీపావళి బోనస్ ఇవ్వడంలో మాత్రం వివక్ష చూపుతుందని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు క్యాలెండర్ ఇచ్చేందుకు కరోనాను సాకుగా చూపిన యాజమాన్యం నేడు ముఖ్యమంత్రి మెప్పు కోసం సింగరేణి అద్భుత ప్రగతి పేరిట ఖరీదైన ఆయిల్ ప్రింట్ తో పుస్తకాలు ముద్రించి, కార్మికులకు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం వివిధ సమస్యల మీద సిహెచ్పి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, రాష్ట్ర కార్యదర్శి రామగిరి. రామస్వామి, సిహెచ్పి పిట్ కార్యదర్శి ఏ శ్రీనివాస్, యూనియన్ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment