ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి “స్పందన"
విజయనగరం,పెన్ పవర్
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు "స్పందన” కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు సోమవారం నిర్వహించారు. "స్పందన" కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ 25 ఫిర్యాదులును జిల్లా పోలీసు కార్యాలయంలో స్వీకరించారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులపై అదనపు ఎస్పీ సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదు అంశాలను తెలిపి, వాస్తవాలను తెలుసుకొని, తగిన సూచనలతో ఆదేశాలు జారీ చేసారు. “స్పందన” కార్యక్రమంకు వచ్చిన కొన్ని ముఖ్యమైన ఫిర్యాదులు.విశాఖపట్నం జిల్లా, పెందుర్తికి చెందిన టి.మురళి ఫిర్యాదు చేస్తూ జామి మండలం,జాగరం గ్రామం,సర్వేనెం. 246/6లో 388 చంగులు స్థలం తన నాన్నగారి పేరున 2007 లో కొనుగోలు చేసినట్లు, తన స్థలం లో జాగరపు అప్పలస్వామి మరియు 9 మంది పశువుల గెత్తం వేసుకొనుచున్నారని, ప్రస్తుతం తన స్థలంను జెసిబితో పని చేయుటకు ప్రయత్నించగా సదరు 10 మంది ఆటంకము కలిగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, న్యాయం చేయాల్సిందిగా జామి ఎస్.ఐని ఆదేశించారు.విజయనగరం పట్టణం, కణపాక, గొల్లవీధికి చెందిన ఎ. గంగమ్మ ఫిర్యాదు చేస్తూ కణపాకలో తన ఇంటిప్రక్కన పి.మల్లయ్య, సురేషు ఇంటిని నిర్మించుకొంటున్నారని, వారు తన ఇంటిముందు స్థలంలోకి కట్టడం చేస్తున్నారని, అడిగినందుకు కొడుతూ దౌర్జన్యం చేస్తున్నారని, న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం 1వ పట్టణ సిఐని ఆదేశించారు.డెంకాడ మండలం, పినతాడివాడ గ్రామానికి చెందిన కె.అప్పలనాయుడు ఫిర్యాదు చేస్తూ తను పినతాడివాడ గ్రామంలో సర్వే నెం. 37/2 లో 12 సెంట్లు భూమి కొనుగోలు చేసి, సదరు స్థలంలో 300 గజముల స్థలంలో ఇల్లు, ప్రహరీగోడ నిర్మించుకొని తన కుటుంబంతో నివసిస్తున్నట్లు, తన ఇంటిముందు ఖాళీ స్థలంలో కె. సన్యాసి, కె.అప్పలనాయుడులు గొర్రెల గెత్తం వేసి తనకు అసౌకర్యం కలిగిస్తున్నట్లు, అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని, వారి నుండి రక్షణ కల్పించవలసిందిగా కోరారు. ఫిర్యాదును పరిశీలించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, న్యాయం చేయాల్సిందిగా డెంకాడ ఎస్. ఐని ఆదేశించారు.
బలిజిపేట మండలం, అజ్జాడ గ్రామానికి చెందిన ఆర్.సింహాచలం ఫిర్యాదు చేస్తూ విశాఖపట్నం, గోపాలపట్నంకు చెందిన జె. ఉమాదేవి తనకి గ్రూపు హౌస్ అమ్ముతానని, రూ. 50,000/-లు అడ్వాన్సుగా తీసుకొని ఒప్పందంకంటే రేటు తేడాగా చెప్పి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బులు తనకు ఇప్పంచి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన అదనపు ఎస్పీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం 1వ పట్టణ సిఐని ఆదేశించారు.ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ స్వయంగా ఫోనులో మాట్లాడి, వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వెంటనే తనకు నివేదించాలని అధికారులను అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్ బి సి.ఐ బి. వెంకటరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment