లాలం ఇలాకాలో తెలుగుదేశం డీలా
లాలం కోడూరులో కనిపించని పసుపు జెండాసర్పంచ్ పోటీల్లో లేని తెదేపా
విశాఖ పొలిటికల్ బ్యూరో, పెన్ పవర్
పేరుగొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారింది జిల్లాలోని లాలం కుటుంబీకుల పరిస్థితి. కేబినెట్ ర్యాంకు హోదా అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని భార్యకు, ఎలమంచిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని అందించిన పార్టీకి సొంత గ్రామంలో ప్రాతినిధ్య లేకుండా చేయడంపై తెలుగుదేశం పార్టీ అభిమానులు విస్తుపోతున్నారు.
విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం పేరు చెబితే ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, లాలం బాస్కరరావు కుటుంబ సభ్యులే గుర్తుకు వస్తారు. ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ పార్టీ అందించిన పదవులను అనుభవించారు. వయసు మీద పడిన ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతుండగా , కేబినెట్ ర్యాంకు పదవుని అనుభవించిన లాలం బాస్కరరావు మాత్రం గ్రామంలో పత్తా లేకుండా పోయారని తెలుగు తమ్ముళ్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత గ్రామం నుంచి కనీసం తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచిని పోటీలో నిలపలేని దయనీయ స్థితిలోకి జారుకున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాలం భాస్కరరావు, ఆమె భార్య భవాని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా భాస్కరరావు తమ్ముళ్లు మాత్రం సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయారో ఏమోగానీ ఫ్యాన్ నీడలో హాయిగా సేదతీరుతున్నారు. లాలం కుటుంబం నుంచే వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని ఈ గ్రామం నుంచి వైకాపా తరపున సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మార్గం సుగమం చేశారు. తెలుగుదేశం తరపున జిల్లాస్థాయి పదవులు అనుభవించి పార్టీ పేరుతో రాష్ట్రస్థాయిలో వ్యాపారాలు చక్కబెట్టిన లాలం బాస్కర కుటుంబ సభ్యులు పల్లె పోరుకు విముఖతను చూపుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచారని అభిమానులు వాపోతున్నారు. ఇటువంటి నాయకులకు జిల్లాస్థాయి పదవులు కట్టబెట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానమే భవిష్యత్తులో ఇటువంటి నాయకులకు చెక్ చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లోనే లాలం బాస్కర కుటుంబ సభ్యులు వైకాపా ఎలమంచిలి నియోజకవర్గ ప్రస్తుత శాసన సభ్యులు కన్నబాబురాజుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి లాలం కుటుంబానికి పూర్తిగా పట్టు ఉన్న లాలం కోడూరులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబుకి కేవలం పదుల సంఖ్యలో ఓట్లు మెజార్టీ వచ్చిందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇదే మండలం నుంచి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన భవానికి మాత్రం లాలం కోడూరులో వేలలో మెజార్టీ వచ్చిందని గుర్తు చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న లాలం భాస్కరరావు పార్టీ తరపు నుంచి కనీసం ఒక్క సర్పంచ్ అభ్యర్థుని కూడా పోటీలో నిలవడం అతని గెలిపించ లేకపోవడం పట్ల కార్యకర్తలు రగిలిపోతున్నారు. పార్టీ పదవులను వాడుకునే ఇటువంటి నాయకులు పార్టీకి అవసరమా అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచన చేయాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులు వైకాపాలోను భాస్కరరావు, భవానీలు మాత్రం తెలుగుదేశం పార్టీలోనూ కొనసాగుతున్నట్లు నాటకాలు రక్తి కట్టిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా తెలుగుదేశంలో కొనసాగుతున్న లాలం కోడూరు వాసులు కూడా ఈ అవకాశవాద రాజకీయాల పై మాట్లాడుకుంటున్నారు. పసుపు జెండా రెపరెపలాడే గ్రామంలో వైకాపా జెండాను ఎగుర వేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. పదవుల కోసమే పార్టీయా? పార్టీ కష్టాల్లో ఉంటే పట్టించుకోరా? అంటూ కార్యకర్తలు ఒకింత అసహనానికి గురవుతున్నారు.



No comments:
Post a Comment