కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన కొంపల్లి 2వ వార్డు కౌన్సిలర్..
దుండిగల్,పెన్ పవర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జే.మంజుల కుమార్ గౌడ్ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గురువారం గండి మైసమ్మలోని జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో కొంపల్లి చైర్మెన్ సన్న శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వం అతి తక్కువ వ్యవధిలోనే చేసిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యేందుకు ఇతర పార్టీల నుండి అనేక మంది చేరుతున్నారని, పార్టీపై నమ్మకంతో చేరిన ప్రతి ఒక్కరికీ అధిష్టానం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment