Followers

ఐక్యత చాటిన ఆర్యవైశ్య మహిళలు

 ఐక్యత చాటిన ఆర్యవైశ్య మహిళలు  - 25వ వార్డులో విస్తృత ప్రచారం



నర్సీపట్నం, పెన్ పవర్ :


ఆర్యవైశ్య మహిళలు ఐక్యత చాటారు. నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో 25 వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఆర్యవైశ్య మహిళ దేవత అరుణకు మద్దతుగా ఆర్యవైశ్య మహిళలు ప్రచారం నిర్వహించారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆర్యవైశ్య మహిళలందరూ ఏకమయ్యారు. వీరికి తోడు జిల్లాలోని  వాసవి వనిత క్లబ్ ముఖ్య కేంద్రాలు నుంచి మహిళలు తరలివచ్చారు.  వాసవి కళ్యాణ మండపం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. అయ్యరకవీధి,  మేదరవీధి, తోటవారి వీధి,  లగుడు వారి వీధి మొత్తం వార్డ్ అంతా గడప గడపకు బొట్టు పెట్టి ప్రచారం నిర్వహించారు.  తొలిసారి పోటీ చేస్తున్న మా ఆడపడుచును ఆదరించండని అన్ని వర్గాల ఓటర్లను అభ్యర్థించారు. వార్డు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. హంగూ ఆర్భాటం లేకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న మీలాంటి వారికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని వార్డు పెద్దలు ఆశీర్వదించారు. తనను గెలిపించి కౌన్సిల్లో కూర్చోబెడితే వార్డులో నిరంతర పారిశుద్ధ్య పనులు చేపడతానని, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని,  విద్యుత్ దీపాల సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోనే 25 వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు.

మున్సిపాలిటీలో ' రింగ్ ' తిప్పుతున్న స్వతంత్రులు

 మున్సిపాలిటీలో ' రింగ్ ' తిప్పుతున్న స్వతంత్రులు

- 1, 2, 3 వార్డులలో స్వతంత్రుల హవా


నర్సీపట్నం, పెన్ పవర్ :







మున్సిపాలిటీ ఎన్నికలలో 1, 2, 3 వార్డులలో స్వతంత్ర అభ్యర్ధులు ఆదిపత్యాన్ని ప్రదర్సిస్తున్నారు.  ప్రధానపార్టీల అభ్యర్ధులు కన్నా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకటికి రెండుసార్లు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. 1, 2 వార్డులలో మాకిరెడ్డి అప్పారావు దంపతులు పోటీ చేస్తుండగా, 3 వ వార్డులో  మామిడి శ్రీనివాసరావు తన సోదరి చెక్కా బాలమ్మను పోటీలో ఉంచారు. శ్రీనివాసరావు సతీమణి అరుణకుమారి సిట్టింగ్ కౌన్సిలర్. అయినప్పటికీ నామినేషన్ సమయంలో కులదృవీకరణ పత్రం పై అభ్యంతరాలు రావడంతో నామినేషన్ తిరస్కరించారు.  దీంతో శ్రీనివాసరావు తన సోదరిని పోటీలో ఉంచారు.  అయితే మాకిరెడ్డి అప్పారావు,  మామిడి శ్రీనివాసరావు ఇద్దరూ చింతకాయల సన్యాసిపాత్రుడు అనుచరులే. చివరి వరకు బి-ఫారంలు ఆశించి స్వతంత్రులుగా బరిలో నిలవాల్సి వచ్చింది. 1, 2 వార్డులలో మాకిరెడ్డి అప్పారావు, విజయకుమారి దంపతులు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.  అప్పారావు గత ఐదు సంవత్సరాలుగా రెండు వార్డుల్లో సొంత నిధులతో అనేక సంక్షేమ చేస్తూ వచ్చారు.  రెండు వార్డులలో ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా, వధువుకు బంగారు శతమానం, పట్టు బట్టలు, పసుపు కుంకుమ ఇవ్వడం సాంప్రదాయంగా పెట్టుకున్నాడు. అంతేకాకుండా వార్డులో ఎవరు మృతి చెందిన దహన సంస్కారాలు తానే దగ్గరుండి చేయించడం,  ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగితే బాధితులకు అండగా నిలవడం, ఇలా ఏ కష్టం వచ్చినా ప్రజలకు అండగా ఉంటూ, ఆయా కుటుంబాల్లో  ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.  కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించేందుకు మిగతా నాయకులకు స్పూర్తిని ఇచ్చింది కూడా అప్పారావే. దీంతో  పార్టీతో సంబంధం లేకుండా ఆ వార్డులో ప్రజలు మాకిరెడ్డి దంపతులకు నీరాజనాలు అందిస్తున్నారు. అదేవిధంగా మూడో వార్డు లో మామిడి శ్రీనివాసరావు భార్య, సిట్టింగ్ కౌన్సిలర్ మామిడి అరుణ తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.  ఇకముందు నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సీ కార్పొరేషన్ నుండి రుణ సదుపాయం కల్పించారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె  నామినేషన్ తిరస్కరింపబడడంతో చెక్కా బాలమ్మ పోటీలో ఉన్నారు. అయితే ఎలక్షన్ కమీషన్  ఉంగరం గుర్తు కేటాయించిన సమయం నుండి, ఆగుర్తును  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు.  మొత్తం మీద మూడు వార్డులలో ఉంగరం గుర్తు పై స్వతంత్ర అభ్యర్థులు, ప్రధాన పార్టీలపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.

సమయం లేదు మిత్రమా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలి,అభివృద్ధి గెలవాలి

సమయం లేదు మిత్రమా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలి,అభివృద్ధి గెలవాలి 

మనగుర్తు సైకిల్- మళ్ళ సురేంద్ర



పెన్ పవర్,అనకాపల్లి

81వ వార్డ్ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి  శ్రీమతి మళ్ళ కృష్ణకుమారి ఇంటింటా ప్రచారం భాగంగా  స్థానిక వన్ వే ట్రాఫిక్ జంక్షన్లో 81వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మళ్ళ సురేంద్ర  నిర్వహించారు ఈ సందర్భంగా  మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరు ఎన్ని చెప్పినా ప్రలోభాలకు గురికాకుండా ప్రజా వ్యతిరేకంగా పాలన నడుస్తోందని గమనించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అందర్నీ మంచి మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి శంకర్రావు, వేగి కృష్ణ, తిప్పన అప్పారావు మరియు తదితరులు పాల్గొన్నారు

వారణాసికి బయలుదేరిన మహాశివరాత్రి ప్రత్యేక బస్సులు

 వారణాసికి బయలుదేరిన మహాశివరాత్రి ప్రత్యేక బస్సులు



పెన్ పవర్ , రావులపాలెం

మహాశివరాత్రి రోజున కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా రావులపాలెం ఆర్టీసీ డిపో నుంచి ఏర్పాటు చేసిన 12 రోజుల కాశీయాత్రకు సంబంధించిన రెండు బస్సులు ఆదివారం బయలుదేరాయని డిపో మేనేజర్ టి.అజితకుమారి తెలిపారు. ఈ యాత్రలో భాగంగా బస్సులు అరసవిల్లి, పూరీజగన్నాధ్, కోణార్క్, భువనేశ్వర్, బుద్దగయ  మీదుగా ఈనెల 11వ తేదీ మహాశివరాత్రి రోజుకి వారణాసి చేరుకుంటాయన్నారు. అక్కడ నుంచి వారణాసి గంగాహారతి, గంగా యమునా సరస్వతీ నదీ సంగమం, అయోధ్య రామ మందిరం, నైమిషారణ్యం, గోమతి నదీ స్నానం, గయ, ఉజ్జయినీ, ఓంకారేశ్వరజ్యోతిర్లింగ దర్శనం, ఘృషేశ్వర జ్యోతిర్లింగ దర్శనము, యాదగిరి గుట్ట, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని రావులపాలెం చేరుకుంటాయన్నారు.

పున:ఆవిష్కరణల కారణంగానే కరోనాపై పోరాటాన్ని భారత్ ముందుండి నడిపిస్తోంది: ఉపరాష్ట్రపతి

 మూలాల్లోకి తిరిగి వెళ్లడం, పరిశోధన, పున:ఆవిష్కరణల కారణంగానే కరోనాపై పోరాటాన్ని భారత్ ముందుండి నడిపిస్తోంది: ఉపరాష్ట్రపతి 




మానవాళి గౌరవించుకునే ఉత్తమ వృత్తుల్లో వైద్యవృత్తి ఒకటి

వైద్య ఖర్చులు పెరుగుతుండటంపై ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన

దేశంలో అతిపెద్ద సామాజిక భద్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈఎస్ఐసీపై ప్రశంసలు

విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈఎస్ఐసీ వైద్య కళాశాల, ఫరీదాబాద్ తొలి స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగం

బాధితులను పరీక్షీస్తున్నప్పుడు మానవత్వంతో వ్యవహరించాలని వైద్యులకు సూచన

  న్యూఢిల్లీ,  పెన్ పవర్ 

సంప్రదాయ మూలాల్లోకి వెళ్లడం, పరిశోధనలు, పున:ఆవిష్కరణల కారణంగానే ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాపై పోరాటాన్ని భారతదేశం ముందుండి నడిపిస్తోందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల కారణంగానే కరోనా సవాలును ఎదిరించి సమస్యకు సాంకేతిక పరిష్కారం కనుగొన్నామని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఆదివారం విజ్ఞాన్ భవన్‌లో  ఈఎస్ఐసీ వైద్య కళాశాల (ఫరీదాబాద్) తొలి స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలోఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు. భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలతోపాటు విధాన నిర్ణేతలు సరైన సమయంలో తీసుకున్న సరైన  నిర్ణయాల కారణంగానే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మనం విజయం సాధించామని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ‘వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఆశా వర్కర్లు ఇలా కరోనాపై పోరాటంలో ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కృషిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు. పీపీఈ కిట్లు, సర్జికల్ గ్లవ్స్, మాస్కులు, వెంటిలేటర్లు, చివరకు టీకాను కూడా తక్కువ సమయంలో ఉత్పత్తిచేసిన భారతీయ పరిశ్రమను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతి విద్యార్థి జీవితంతో గ్రాడ్యుయేషన్ డే ఎంతో ప్రత్యేకమన్న ఉపరాష్ట్రపతి, జీవితంలో తర్వాతి దశలో సేవ చేసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ‘స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో మానవాళికి సేవకోసం మీరు చేసే సేవ ద్వారా అనంతరమైన మానసిక తృప్తిని పొందుతారని నేను బలంగా విశ్వసిస్తాను’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వైద్యవృత్తి అత్యంత పవిత్రమైన వృత్తి అన్న ఉపరాష్ట్రపతి, వృత్తి నిర్వహణలో చిత్తశుద్ధితోపాటు నైతికతను, విలువలను పాటించాలని యువ వైద్యులకు సూచించారు. విలువలను పాటించే విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదన్న ఆయన, కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో వైద్యవృత్తి మరిన్ని సవాళ్లతో కూడుకున్నదని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనాపై పోరాటంలో ముందు వరస పోరాటయోధులుగా పాటుపడాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

కార్యక్రమంలో భాగంగా విశిష్ట ప్రతిభను కనబరచిన విద్యార్థులకు పతకాలను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి, వారంతా అమ్మాయిలే కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశం ఇస్తే, ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయనే దానికి ఇదో ఉదాహరణ అని, సోమవారం అందరికీ మహిళా దినోత్సవం కాగా, ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఒక రోజు ముందే జరుపుకుందని తెలిపారు. కరోనా టీకాకరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా ముందుకు సాగుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ.. కరోనా కారణంగానెలకొన్న పరిస్థితులు మెల్లిమెల్లిగా సర్దుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కరోనా పూర్తిగా నిర్మూలించబడేంతవరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వాన్ని వహించవద్దని దేశప్రజలకు ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రస్తుత కరోనా మహమ్మారి పట్టణాలతో పోల్చి చూస్తే, గ్రామాల్లో తన ప్రభావాన్ని చూపించలేకపోయిందని, దీనికి కారణం గ్రామీణ వాతావరణమే అని తెలిపారు.  పట్టణాల్లో ఇళ్ళు మొదలుకుని, ఆఫీసుల వరకూ ప్రతి ఒక్కటీ అన్నివైపుల పూర్తిగా మూసి ఉంచిన కారణంగా గాలి, వెలుతురు, సహజమైన వాతావరణానికి దూరం అవుతున్నారని, ఈ పరిస్థితులో మార్పు రావాలని, ఈ దిశగా నిర్మాణ రంగ నిపుణులు దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల కేసులపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో 65శాతం మరణాలకు అసంక్రమిత వ్యాధులే కారణమన్న ఈ ఏడాది ఆర్థిక సర్వేను సైతం ఆయన ప్రస్తావించారు. పెరుగుతున్న ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు పట్టణ ప్రాంతాల్లో ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్లీనిక్‌లను ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. యువ వైద్యులు సమీపంలోని పాఠశాలలు, కళాశాలలు, సామాజిక కేంద్రాలను సందర్శించి, అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. జీవనశైలిలో మార్పు, పౌష్టికాహార అవసరం తదితర అంశాలను వారికి అర్థమయ్యేలా తెలియజేయాలని తద్వారా అసంక్రమిత వ్యాధులకు వీలైనంత వరకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. దీంతోపాటు వైద్యులు-రోగుల నిష్పత్తి, సరైన సంఖ్యలో వైద్య కళాశాలలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య వసతుల లేమి, ఆరోగ్య బీమా విషయంలో సరైన అవగాహన లేకపోవడం కారణంగా తలెత్తుతున్న అంశాలను కూడా ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.  దీంతోపాటుగా వైద్య ఖర్చులు ఏటేటా పెరగడంపైనా ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు అందుబాటులో మంచి వైద్య వసతులను కల్పించే దిశగా భాగస్వామ్య పక్షాలన్నీ కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశంలోని 10శాతానికిపైగా జనాభాకు సరైన వైద్యవసతులు అందించేందుకు సామాజిక భద్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈఎస్ఐసీని ఉపరాష్ట్రపతి అభినందించారు. అయితే, సమస్యల పరిష్కారం, వైద్య వసతుల అభివృద్ధి తదితర అంశాల్లో మరింత పురోగతి జరిగేందుకు ఆస్కారం ఉందన్నారు. జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్ఏ)తో ఒప్పందం కుదుర్చుకుని, ఈఎస్ఐ పథకం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్‌ జాబితా ఆసుపత్రుల్లో చికిత్సను అందించే విషయంపై నిర్ణయం తీసుకోవడంతోపాటు పలు ఇతర సంస్కరణల ద్వారా కార్మికులకు ఆరోగ్య భద్రత కోసం సంస్కరణలు తీసుకొస్తున్న కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు.

అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా భారతదేశం సాధిస్తున్న ప్రగతిని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు యువ వైద్యులు మరింత కృషిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి (ఇండిపెంటెండ్ చార్జ్) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ఈ.ఎస్.ఐ.సి. డైరక్టర్ జనరల్ శ్రీమతి అనురాధ ప్రసాద్, డీన్ డా.అసిమ్ దాస్ సహా అధ్యాపకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.

పట్టభద్రులు అభివృద్ధిలో భాగస్వామ్యులు అవ్వాలి..

 పట్టభద్రులు అభివృద్ధిలో భాగస్వామ్యులు అవ్వాలి..



కుత్బుల్లాపూర్/పెన్ పవర్


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డు పరిధి గంగస్థాన్ లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మార్నింగ్ వాకర్స్, పట్టభద్రులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు. బ్యాలెట్‌ పేపర్లో నాలుగో నంబర్‌ వద్ద వాణీదేవికి ఎదురుగా ఒకటి నంబర్‌ వేసి ఓటు వేయాలని బ్యాలెట్‌ పేపర్‌ను ఓటర్లకు చూపించారు. 




 వాణీదేవిని గెలిపిస్తే విద్యావంతురాలైన ఆమె పట్టభద్రుల సమస్యల పరిష్కారంకు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, దూలపల్లి పిఎసిఎస్ చైర్మన్ నరేందర్ రాజు, కౌన్సిలర్లు లక్ష్మీ దేవేందర్, రవీందర్ యాదవ్, డప్పు కిరణ్ కుమార్, సీనియర్ నాయకులు బూర్గుబావి హన్మంత రావు, దేవేందర్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బూర్గుబావి సత్యనారాయణ, మధు సుధన్ యాదవ్, నాయకులు మోహన్ రావు, వెంకటేష్, జి.రాకేష్, జి.వెంకటేష్, జి.సతీష్, సాయి గౌడ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీసిటీలో ప్రారంభ మైన గోల్ఫ్ క్రీడాలు

 శ్రీసిటీలో ప్రారంభ మైన  గోల్ఫ్ క్రీడాలు

- లాంఛనంగా ప్రారంభించిన జపాన్ కాన్సుల్ జనరల్ 




 శ్రీసిటీ, పెన్ పవర్


ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన గోల్ఫ్ క్రీడా మైదానం శ్రీసిటీలో ప్రారంభమైంది. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టగా మసయుకి శనివారం సాయంత్రం దీనిని ప్రారంభించగా, ఇండియన్ గోల్ఫ్ యూనియన్ కోశాధికారి ఈశ్వర్ ఆచంత, ఎపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వీరారెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, పలు పరిశ్రమల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇందులో పాల్గొన్నారు. కాన్సుల్ జనరల్ లాంఛనంగా బంతిని కొట్టి గోల్ఫ్ క్రీడా మైదానం ప్రారంభమైనట్లు ప్రకటించారు.  


అతిథులకు సాదర స్వాగతం పలికిన రవీంద్ర సన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడా వినోద వసతుల రూపకల్పనలో భాగంగా నేడు గోల్ఫ్ క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో మరిన్ని వసతులను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. శ్రీసిటీలోని విదేశీ ప్రతినిధులు, పరిశ్రమల ఉద్యోగులు, శ్రీసిటీ పరిధిలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ గోల్ఫ్ క్రీడను ఆడడం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని, మానసిక ఉల్లాసాన్ని పొందాలని ఆయన కోరారు. 


టగా మసయుకి మాట్లాడుతూ, జపాన్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడను ఇక్కడ జపాన్ పరిశ్రమల ప్రతినిధులకు చేరువ చేసినందుకు శ్రీసిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాపార నగరంలో క్రీడా సదుపాయాలు నెలకొల్పడం మంచి పరిణామమన్న ఆయన, శ్రీసిటీలో సామాజిక వసతుల అభివృద్ధి విషయంలో యాజమాన్య కృషిని అభినందించారు.  


క్రీడలను ప్రోత్సాహం కోసం ప్రవేశపెట్టబడిన కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈశ్వర్ ఆచంత ప్రస్తావిస్తూ, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. శ్రీసిటీ కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో దేశంలోని అత్యుత్తమ గోల్ఫ్ మైదానాలలో ఒకటిగా ఇది మారుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 





ఏపీ ప్రభుత్వ సలహాదారు వీరారెడ్డి మాట్లాడుతూ, కేవలం పరిశ్రమలే కాకుండా క్రీడలు, వినోదంతో సహా అన్ని వసతులతో ఓ మంచి నివాస నగరంగా శ్రీసిటీని అభివృద్ధి చేస్తున్నందుకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిని అభినందించారు. 


గోల్ఫ్ క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీసిటీ కన్సల్టెంట్ ఎస్ పి శర్మ సమన్వయ భాద్యులుగా వ్యవహరించారు. ఆహ్లాదకర వాతావరణంలో 10 ఎకరాలలో విస్తరించి ఉన్న శ్రీసిటీ గోల్ఫ్ డ్రైవింగ్ రేంజ్‌ (గోల్డ్ క్రీడా మైదానం) లో గోల్ఫ్ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచుకోడానికి, కొత్తవారు ప్రాథమిక శిక్షణ పొందడానికి  అవకాశం ఉంటుంది. అనుభవం కలిగిన గోల్ఫ్ కోచ్ లు అందుబాటులో వుండి శిక్షణ ఇస్తారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...