నగరపాలక సంస్థ నూతన పాలక వర్గ మేయర్ గా ముచ్చు నాగలక్ష్మి
విజయనగరం,పెన్ పవర్నగరపాలక సంస్థ నూతన పాలక వర్గం గురువారం కొలువుదీరింది. మేయర్ గా వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా ముచ్చు నాగలక్ష్మి ఎన్నికయ్యారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దండే,ప్రత్యేక అధికారి మరియు జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ హాజరయ్యారు. కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.అక్షర క్రమంలో సభ్యులందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. ఈ సమావేశంలో ముందుగా నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఎక్స్ అఫిషియో మెంబర్ గా సమావేశానికి హాజరయ్యారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 48 మంది సభ్యులు ఓవైపు, తెలుగుదేశం, స్వతంత్ర సభ్యులకు మరోవైపు సీట్లను కేటాయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రకటన వెలువరించారు. మేయర్ గా వెంపటాపు విజయలక్ష్మి పేరును సీనియర్ సభ్యులు ఎస్ వి వి రాజేష్ ప్రతిపాదించగా, మరో సభ్యులు కేదారి శెట్టి సీతారామమూర్తి బలపరిచారు. సభలో మెజార్టీ సభ్యులు వెంపడాపు విజయలక్ష్మి అభ్యర్థిత్వానికి మద్దతు తెలపడంతో ఆమె మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. మేయర్ ఎన్నిక లాంఛనప్రాయమే అయ్యింది. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రకటన వెలువరించారు. ఒకటో వార్డు కు చెందిన ముచ్చు నాగలక్ష్మి పేరును 40వార్టు సభ్యురాలు బోనెల ధనలక్ష్మీ ప్రతిపాదించగా, 42వవార్టు సభ్యురాలు పిన్నింటి కళావతి బలపరిచారు. నాగలక్ష్మి అభ్యర్థిత్వానికి మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో ఆమె డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్ లాంఛనప్రాయమే అయ్యింది. సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ మేయర్, డిప్యూటీ మేయర్ లకు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ,కమిషనర్ ఎస్ ఎస్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ఆదర్శ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, పౌరులకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించే విధంగా కృషి చేయాలన్నారు. స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రజా పాలకవర్గం నేడు కొలువుదీరిందని అభివర్ణించారు. అవినీతికి ఆస్కారం లేకుండా నీతివంతమైన పాలనను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని అన్నారు.










