ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి
జర్నలిస్టుల మరణాలను ఆపండి - టీయూడబ్ల్యూజే
పెన్ పవర్, మల్కాజిగిరిజర్నలిస్టులను కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించి జర్నలిస్టులకు మనోధైర్యం, ఆర్థిక చేయూత అందించాల ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు ఒక ప్రకటనలో కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి, రెండో దఫాల్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 55 మంది జర్నలిస్టులు కరోనాతో నేలకొరిగినట్లు వారు విచారం వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్ మాసంలోనే రాష్ట్రంలో వరుసగా 29 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా ప్రారంభం నుండి నేటివరకు 3,800 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు వివరించారు. అయితే ఐసోలేషన్ లో ఉంటున్న కొందరికి మాత్రమే మీడియా అకాడమీ నుండి ఆర్థిక సహాయం అందుతున్నదని, ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటున్న పలువురు బాధిత జర్నలిస్టులకు సహాయం అందించడంలో జాప్యం చేయడం సరైంది కాదన్నారు. అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు అందిస్తున్న 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన అప్పులకు కూడా సరిపోవడం లేదని శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శేఖర్, విరాహత్, శ్రీకాంత్ లు ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాలకు ఇతర రాష్ట్రాల మాదిరిగా కనీసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. అలాగే పంజాబ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాల మాదిరిగా వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.